మోడీజీ.. ఏమిటీ ఈ ‘పద్మ’ లీలలు..!

ఎన్సీపీ అంటే.. న్యాచురల్ కరప్టెడ్ పార్టీ.. ఇదీ శ్రీమాన్ నరేంద్రమోడీ వర్యులు ఇచ్చిన నిర్వచనం! ఇంతేనా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై కమలం పార్టీ ఎన్ని ఆరోపణలు చేసిందో లెక్కేలేదు! అందుకు తగ్గట్టుగా పలు స్కాముల్లో శరద్ పవార్ పేరు కూడా వినిపించింది! ఐపీఎల్ కుంభకోణంతో మొదలుపెడితే.. ఏయే అవినీతి వ్యవహారాల్లో ఎన్సీపీ పేరు, ఆ పార్టీ అధినేత పేరు వినిపించిందో బీజేపీకే బాగా తెలుసు!

స్వయంగా ప్రధానమంత్రి హోదాలోని మోడీగారు.. అవినీతి ఆరోపణలు చేసిన ఎన్సీపీ అధినేతకు ఏకంగా పద్మ విభూషణే ప్రకటించేశారు! భారతరత్న తర్వాతి స్థాయి అవార్డును ఇస్తున్నారు! అవినీతి కంపం, ఆయనే ఒక స్విస్ బ్యాంక్, ఆయన నల్లకుభేరుడు.. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ శ్రీమాన్ శరద్ పవార్ కు ఇచ్చిన బిరుదులు.. ఇప్పుడు వీరి ప్రభుత్వం ఆయనకే పద్మవిభూషణ్ ఇస్తోంది!

మరి అప్పుడు చేసిన అవినీతి ఆరోపణలు అబద్ధమా? లేక ఇప్పుడు ఇస్తున్న అవార్డుకు విలువ లేదా? ఈ విషయాల గురించి మోడీ భక్తగణం, శ్రీమాన్ మోడీగారు, కమలం పార్టీ నేతలు చెప్పాలి!

పవార్ ను ప్రసన్నం చేసుకోవడానికి వేసిన రాజకీయ ఎత్తుగడ ఈ పద్మవిభూషణం అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ తో గతంలో చాలా సఖ్యతతో ఉండిన పవార్.. సమయానుకూలంగా ఆ పార్టీకి దూరం అయ్యాడు. మహారాష్ట్రలో కాంగ్రెస్ తో పొత్తును తెంచేసుకున్నాడు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు బీజేపీకి ఆయన చాలా దగ్గరయ్యాడు! 

మరి అంత దగ్గరయ్యాడు కదా.. ఆయనను ఎంటర్ టైన్ చేయడానికే ఒక పద్మాన్ని ఆయన మీదకు విసిరినట్టుగా ఉన్నారు! రాజు తలుచుకుంటే.. దెబ్బలకే కొదవా? అధికార పార్టీ ఇష్టులకు ఇవ్వడానికి పద్మా అవార్డుల కొదవా? 

Show comments