'ఖైదీ' అక్కడే ఎందుకట.?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ఆడియో విడుదల వేడుకకు అనుమతినివ్వలేదనే ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ రద్దయ్యిందన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం. అయితే, 'ధృవ' సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ కోసం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ని అటకెక్కించారన్నది ఇంకో వాదన. సెంటిమెంట్‌నే ఫాలో అయితే, 'ధృవ' తరహాలో తెలంగాణలోనే, అదీ హైద్రాబాద్‌లోనే, అది కూడా 'ధృవ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగిన చోటే చెయ్యాలి. కానీ, అది జరగలేదు కదా.! 

పట్టుబట్టి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతికి నిరాకరిస్తున్నా.. అక్కడే 'ఖైదీ' ఈవెంట్‌ ఎందుకు చేయాలనుకుంటున్నట్లు.? ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కావడంలేదు. అన్నీ అనుకూలంగా వుంటే, ఫంక్షన్‌ ఎక్కడ జరిగితే ఏంటి.? అదసలు సమస్యే కాదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతున్నా, అక్కడే ఈవెంట్‌ జరిపి తీరాలన్నది మెగా కాంపౌండ్‌ పట్టుదలగా కన్పిస్తోంది. అయితే, ఇంతా చేసి ఓ చిన్న ప్రాంతంలో 'మమ' అన్పించేస్తారేమో అన్న అనుమానాలు ఇప్పుడు అభిమానుల్ని వేధిస్తున్నాయి. 

ఇప్పుడు ఫైనల్‌ అయిన వేదిక 'హాయ్‌ లాండ్‌'లో గట్టిగా అంటే 20 వేల మందికి మాత్రమే స్పేస్‌ సరిపోతుందన్నది ఓ అంచనా. చిరంజీవికి వున్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో తక్కువలో తక్కువ 50 వేల నుంచి ఒక లక్ష వరకూ అభిమానులు వస్తారని మెగా కాంపౌండ్‌లోనే అంచనాలున్నట్లు తెలుస్తోంది. పాస్‌లు ఇవ్వడం ఓ ఎత్తు, పాస్‌లు ఇచ్చినా ఇవ్వకున్నా అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం ఇంకో ఎత్తు. 

ఇన్‌డోర్‌ ఫంక్షన్లకు సంబంధించి అభిమానుల్ని కంట్రోల్‌ చేయడానికి వీలుంటుందేమోగానీ, ఔట్‌డోర్‌లలో ఆ పరిస్థితులు వుండవు. పైగా, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందనప్పుడు, ఈవెంట్‌ నిర్వహించడం కత్తిమీద సామే. మొత్తమ్మీద, 'ఖైదీ' సినిమా సంగతేమోగానీ, 'ఖైదీ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇప్పుడు నరాలు తెగే ఉత్కంఠకు కారణమవుతోంది. 

Show comments