పవన్‌కళ్యాణ్‌లో ఆ 'పవర్‌' ఎక్కడ.?

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, జనసేనాధిపతి హోదాలో ట్విట్టర్‌ వేదికగా చేసుకుని 'పొలిటికల్‌ అస్త్రాలు' సంధిస్తున్నారు. కామెడీ ఏంటంటే, ఈ ఆస్త్రాలు ఒకదాన్ని మించి ఇంకోటి తుస్సుమంటున్నాయి. ఏదీ లక్ష్యాన్ని తాకడంలేదు. లక్ష్యం సంగతి దేవుడెరుగు, మాంఛి ఎంటర్‌టైనింగ్‌ స్కిట్స్‌లా తయారయ్యాయి ఈ ట్వీటాస్త్రాలు. 

మొన్న 'గో వధ' గురించీ, ఆ తర్వాత హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ వేముల గురించీ, ఆ వెంటనే దేశభక్తి గురించీ ట్వీటాస్త్రాలు సంధించిన పవన్‌కళ్యాణ్‌, తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై మరో కామెడీ ట్వీటాస్త్రం సంధించారు. విషయం ఎంత సీరియస్సో, పవన్‌కళ్యాణ్‌ ట్వీటాస్త్రం అంత కామెడీగా తయారయ్యింది. దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్న చందాన, పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు కళ్ళు తెరిచారు. 

గతంలో బీజేపీ - టీడీపీతో సత్సంబంధాలున్నప్పుడు, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ - టీడీపీకి కలిసి మాయమాటలు చెబుతున్నాయనే అంశాన్ని పవన్‌కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తే, 'ఇవ్వబోమని చెప్పాక కదా, మనం మాట్లాడాల్సింది..' అంటూ తప్పించుకు తిరిగారాయన. ఇప్పుడేమో, మూడు బహిరంగ సభలు పెట్టేసి, అలసిపోయినట్టున్నారు.. ఇదిగో ఇప్పుడు ట్విట్టర్‌ వేదికగా చేసుకుని, ఏవేవో మాట్లాడుతున్నారు. 

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నది పవన్‌కళ్యాణ్‌ ఉవాచ. ఆ లెక్కన ముందుగా పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించాల్సింది మెగాస్టార్‌ చిరంజీవినే కదా. ఎందుకంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు చిరంజీవి కేంద్ర మంత్రిగా వున్నారు మరి.! ఆయన మంత్రిగా వున్న ప్రభుత్వమే ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. ఆ విభజననే కదా, పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ప్రశ్నిస్తున్నది.? 

చిరంజీవి సంగతి పక్కన పెడితే, నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన పవన్‌కళ్యాణ్‌, ఎంచక్కా ట్విట్టర్‌లో హంగామా చేస్తున్నారు.. అదీ ప్రశ్నించాల్సిన సమయంలో నిద్దరోయి.. ఇప్పుడే నిద్రలేచారు మరి. జనసేన జెండాలతో కొందరు అమాయకులు.. ఇప్పటికీ ఆ పార్టీ మీద, పార్టీ అధినేత మీద అభిమానంతో నానా తంటాలూ పడ్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ జనంలోకి వస్తారు, పార్టీని నిర్మిస్తారు, పటిష్టం చేస్తారన్నది వారి నమ్మకం. ఏదీ ఎక్కడ.? 

2014 ఎన్నికల సమయంలో పార్టీ పెట్టారు, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలన్నారు.. అంతా తుస్సుమంది. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు. ఏంటీ, ఇలాగేనా.? ట్విట్టర్‌లో ప్రశ్నిస్తే, పార్టీ బలోపేతమవుతుందా.? అదెలా.! పవన్‌కళ్యాణ్‌ దగ్గర మంత్రదండమేమీ లేదు కదా.! 

పవన్‌కళ్యాణ్‌ సినీ రంగంలో పవర్‌ స్టార్‌ కావొచ్చుగాక. రాజకీయాల్లో జస్ట్‌ పవర్‌లెస్‌ స్టార్‌. డౌటేమన్నా వుందా.? ట్విట్టర్‌లో ఆయన సంధిస్తున్న ప్రశ్నల్ని చూస్తే మీకే అర్థమవుతుంది. జై ఆంధ్రా ఉద్యమానికీ, ప్రస్తుత పరిస్థితులకీ పొంతనేంటట. దాన్నీ దీన్నీ మిక్స్‌ చేసేసి, ప్రత్యేక హోదా అంశాన్ని పవన్‌ ఎత్తుకుంటున్నారో, డైల్యూట్‌ చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదాయె. దటీజ్‌ పవన్‌కళ్యాణ్‌.

Show comments