'మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం..' అంటూ కర్నూలులో ప్రత్యేక హోదా కోసం నినదిస్తూ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారో లేదో, వెంటనే టీడీపీ నుంచి ఖండన ప్రకటన వచ్చేసింది. అసలు వైఎస్ జగన్ ఎందుకు రాజీనామాస్త్రాన్ని సంధించాలనుకుంటున్నారు.? అసలాయన రాజకీయ వ్యూహమేంటి.? ఇవన్నీ టీడీపీకీ అనవసరం. జగన్ ఏదో మాట్లాడారట, వెంటనే ఖండించెయ్యాలనుకున్నారు.. ఖండించేశారంతే.
ప్రస్తుత రాజకీయ ట్రెండ్‌లో రాజీనామాలతో పని జరగదు నిజమే. కానీ, ప్రతిపక్షం ఓ 'మంచి పని' కోసం రాజీనామాస్త్రాన్ని ప్రయోగిస్తామని చెబుతున్నప్పుడు, ఆహ్వానించడమో.. ఆచి తూచి స్పందించడమో చెయ్యాలి కదా.. అధికారపక్షంగా.! నిజానికి, రాజీనామాస్త్రాల్ని సంధించాల్సింది అధికారపక్షం. తిరుపతి బహిరంగ సభలో, చంద్రబాబు సమక్షంలో నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అంతకు ముందే, పార్లమెంటు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాలి కదా.?
బీజేపీ, తమకు మిత్రపక్షమైనప్పుడు.. టీడీపీ ఆ మిత్రపక్షాన్ని ప్రశ్నించి ప్రత్యేక హోదా సాధించాల్సి వుంది. ఎంపీ పదవులకు రాజీనామా చెయ్యనక్కర్లేదు, ఎన్డీయే కూటమి నుంచి వైదలగుతామనే హెచ్చరిక అయినా చేసి వుండాలి. కానీ, అదేమీ చెయ్యకుండా.. పదవులు పట్టుకు పాకులాడుతున్న టీడీపీ, వైఎస్సార్సీపీ నుంచి రాజీనామా ప్రకటన వస్తే.. హడావిడిగా ఖండిచెయ్యడమేంటో ఎవరికీ అర్థం కావడంలేదిప్పుడు.
ఎంపీలతోపాటు, ఎమ్మెల్యేలతోనూ వైఎస్ జగన్ రాజీనామా చేయించాలట. పైగా, ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు వైఎస్సార్సీపీకి లేదట. ఇదెక్కడి లాజిక్.? రాజీనామా బంతి టీడీపీ కోర్టులోనే వుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయాల్సించాల్సిన బాధ్యత టీడీపీ మీదనే వుంది. టీడీపీ ఒక్క మాట చెబితే చాలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిపోతుంది. అన్ని అవకాశాలూ తమ పక్కన పెట్టుకుని, జగన్‌కి నైతిక హక్కు లేదని టీడీపీ ప్రశ్నించడం కామెడీ కాకపోతే ఇంకేమిటి.?
ఇదిగో.. అన్ని సందర్భాల్లోనూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఇలాగే టీడీపీ నీరుగార్చేయడం వల్లే కేంద్రం ప్రత్యేక హోదాని అటకెక్కించేసింది. ప్రత్యేక సాయమంటూ ఆంధ్రప్రదేశ్ బొచ్చెలో బిచ్చమేస్తోంది.