'మత్తు' వెనుక మర్మం అదేనా?

ఉన్నట్లుండి టాలీవుడ్ లు పెద్దలు మత్తు మందుల వ్యవహారంపై హెచ్చరికలు జారీ చేసారు. ఎవరెవరు మత్తు మందుల బారిన పడ్డారో పోలీసులకు తెలిసింది. ఎవరెవరు మత్తు మందులు వాడుతున్నారో తెలిసింది. నోటీసులు కూడా జారీ చేసారని వార్తలు బయటకు పొక్కాయి.

ఎంత మందికి నోటీసులు ఇచ్చారో బయటకు వచ్చింది కానీ, ఏవరికి ఇచ్చారన్నది ఇంకా బయటకు రాలేదు. ఈ లోగా ఎవరి ఊహలకు వాళ్లు పేర్లు ఊహించేసుకుంటున్నారు. నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు నోటీసులు అందాయని నిన్న వార్తలు వస్తే, హీరోయిన్లు కొందరికి అందాయని ఇవ్వాళ వార్తలు వచ్చాయి. 

దీంతో టాలీవుడ్ లో కలకలం బయలుదేరింది. ఎప్పుడు ఎవరి మీదకు ఏం ముంచుకు వస్తాయో అని ఎవరూ పెదవి విప్పడం లేదు. చాన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో మత్తుమందుల కలకలం వచ్చి, కాస్త వెంటనే చల్లారింది.

కానీ ఇప్పుడు మాత్రం అంత సులువుగా చల్లారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో మరో సంగతి కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఒక పెద్ద వ్యూహంతో టాలీవుడ్ లో మత్తు మందుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్న వదంతులు వినిపిస్తున్నాయి.

ఆదేశాలు వచ్చాయా?

నిన్నటికి నిన్న ఉన్నట్లుండి టాలీవుడ్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇండస్ట్రీ జనాలను మత్తు మందుల గురించి హెచ్చరించారు. ఇలా ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించమని, టాలీవుడ్ పెద్దలకు 'పై' నుంచి ఆదేశాలు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు వున్నారు? ఎవరికి నోటీసులు ఇచ్చారన్నది చెప్పకుండానే, సినిమా పెద్దలు జనాంతికంగా హెచ్చరికలు చేసారు.

నిజానికి ఇలా హెచ్చరికలు చేయాల్సింది పోలీసలు, సంబంధిత శాఖ అధికారులు. కానీ ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు చేసారన్నది వారికే తెలియాలి. నిజానికి ఇండస్ట్రీ పెద్దలు కావాలనుకుంటే, పోలీసుల నుంచి సమాచారం పొంది నేరుగా, ఆ కొంతమందినే హెచ్చరించవచ్చు. కానీ అలా కాకుండా ఇలా జనాంతికంగా హెచ్చరించి, జనం ఫోకస్ ను టాలీవుడ్ మీదకు తిప్పారు.

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాలు లేదని అనలేము. ఎందుకంటే గతంలో కూడా ఈ తరహా వార్తలు వచ్చాయి. పైగా ఆధారాలు తగినన్ని లేకుండా పోలీసులు నోటీసులు ఇవ్వరు. అలా ఇచ్చారంటే పరిశోధన ప్రారంభమైనట్లే. మరి ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ పెద్దల సుద్దుల వల్ల ఉపయోగం ఏమిటి?

ఎందుకిలా?

అసలు ఒక్కసారిగా టోటల్ మత్తు మందుల ఫోకస్ అంతా టాలీవుడ్ ఇండస్ట్రీ మీదకు మళ్లింది. తీగ కదిలింది వేరే దగ్గర. తొలి తీగ కదలడంతోనే అనేక స్కూళ్ల వ్యవహారాలు బయటకు వచ్చాయి. వీటిలో బడా బడా స్కూళ్లు వున్నాయి. ఈ స్కూళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ జాబితాలు రకరకాలుగా సోషల్ నెట్ వర్క్ లో చలామణీ అయ్యాయి.

ఈ వ్యవహారంపై ఎక్సయిజ్ జనాలు కాస్త అత్యుత్సాహంగా వ్యవహరించారని విమర్శలు కూడా వినిపించాయి. కొంతమంది విద్యార్థుల వల్ల ఏకంగా విద్యాసంస్థలకే అపవాదు ఆపాదించారని కామెంట్లు వినిపించాయి. ఈ వ్యవహారం విద్యామంత్రి, ముఖ్యమంత్రి వరకు వెళ్లింది.

ఇలాంటి నేపథ్యంలో అటు తిరిగి, ఇటు తిరిగి ఒక్కసారిగా టాలీవుడ్ మీదకు వచ్చింది. దీంతో ఫోకస్ అంతా టాలీవుడ్ మీదకు వెళ్లింది. అందునా సినిమా రంగం కావడం, హీరోలు, హీరోయిన్లు, టాప్ డైరక్టర్లు వున్నారని వార్తలు రావడంతో, ఎవరి ఊహాగానాలకు వారు పదును పెడుతున్నారు. టోటల్ మీడియా అంతా ఇప్పడు విద్యా సంస్థలను విస్మరించేసింది. టాలీవుడ్ లో ఎవరు వున్నారు అన్నదాని పైనే దృష్టి పెట్టింది.

అసలు ఈ పరమార్థం కోసమే టాలీవుడ్ ను టార్గెట్ చేసారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విద్యాసంస్థల నుంచి జనాల దృష్టి, మీడియా దృష్టి మళ్లించడం కోసమే టాలీవుడ్ ను సీన్లోకి తెచ్చారని గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల మూడో వారం నుంచి నాలుగో వారం లోపు తమకు అందిన నోటీసులపై సినిమా ప్రముఖులు స్పందించాల్సి వుంటుంది. బయటకు పేర్లు రానంత వరకు జరిగే హడావుడి కేవలం కొన్ని రోజులు మాత్రమే వుంటుంది.

వారం క్రితం చెలరేగిన స్కూళ్ల హడావుడి టాలీవుడ్ పుణ్యమా అని చల్లారింది. నోటీసులకు స్పందించడం, వివరణ ఇవ్వడం అన్నవి వీలయినంత గోప్యంగా జరుగుతాయి కనుక, అప్పుడు కూడా హడావుడి వుండదు. పొరపాటున ఎవరి పేరయినా బయట పడితే అప్పుడు మాత్రమే హడావుడి వుంటుంది.

అంటే ఇప్పుడు చెలరేగిన టాలీవుడ్ హడావుడి మరో వారంలో చల్లారే అవకాశాలు వున్నాయి. పైగా ఇండస్ట్రీలో డ్రగ్స్ బారిన పడ్డవారే వున్నారని ఇప్పటి దాకా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. డ్రగ్స్ చలామణీ చేసేవారు వున్నట్లు వార్తలు రాలేదు. 

అందువల్ల ఇలా డ్రగ్స్ వాడేవారిని అయితే పిలిచి, మందలించి, కౌన్సిలింగ్ చేయించి, అవసరం అయితే ట్రీట్ మెంట్ కు పంపే అవకాశం వుంటుంది. అంతకు మించిన సమస్య డ్రగ్స్ బారిన పడ్డవారికి వుండకపోవచ్చు. అందువల్ల మరో వారం తరువాత టాలీవుడ్-డ్రగ్స్ హడావుడి సద్దు మణిగే అవకాశమే ఎక్కువ వుంది. అంతకన్నా ముందే స్కూళ్ల హడావుడి సద్దు మణిగింది.

Show comments