వెంకయ్యకు చంద్రన్న అభయహస్తం

ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదాయె.. రాజధానికి సహకారం అందించే అవకాశం అంతకన్నా లేదాయె.. అసలు, ఆంధ్రప్రదేశ్‌కి కొత్తగా చేయాల్సిన అవసరమే లేదంటూ కేంద్రం తేల్చేశాక, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అడుగు పెట్టగలరు.? అన్న చర్చ సర్వత్రా జరిగింది. 'ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెంకయ్యను రాజ్యసభకు పంపాలనుకుంటే మర్యాదగా వుండదు..' అంటూ జనం అల్టిమేటం ఇచ్చారు. కర్నాటకలోనూ వెంకయ్యనాయుడికి ఇదే పరిస్థితి. దాంతో, ఇంకో రాష్ట్రానికి ఆయన పరుగులు పెట్టక తప్పలేదు. ఎలాగైతేనేం, వెంకయ్యనాయుడు మళ్ళీ రాజ్యసభకు ఎంపికయ్యారు. 

ఇక, నాలుగోసారి రాజ్యసభకు ఎంపికైన వెంకయ్యనాయుడు తొలిసారిగా విజయవాడకు వస్తుండడంపై సర్వత్రా టెన్షన్‌ నెలకొంది. ఎవరన్నా వెంకయ్యకు నిరసన తెలుపుతారా.? అన్న అంశమై జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థని బీజేపీ శ్రేణులు ఆశ్రయించాయట. అలాగే, ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్‌నీ బీజేపీ నేతలు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఏం రిపోర్ట్‌ వచ్చిందోగానీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడిని ఆశ్రయించారట. 

విజయవాడకు వస్తున్న తనకు బీభత్సమైన వెల్‌కమ్‌ వుండాలని వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడిని కోరడంతో, ఆ ఏర్పాట్లు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు, వెంకయ్యకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారీ ర్యాలీతో బీజేపీ శ్రేణులు, వెంకయ్యనాయుడుకి స్వాగతం పలికాయి. ఇందులో టీడీపీ కార్యకర్తలే ఎక్కువమంది వున్నారట. చంద్రబాబు, వెంకయ్యనాయుడిని ఈ సందర్భంగా సన్మానించేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇలాంటి వ్యక్తి జాతీయ స్థాయికి ఎదగడం మనందరికీ గర్వకారణం అని గొప్పల డప్పాలు షురూ చేశారు. చంద్రబాబు అలా తనను పొగిడేస్తోంటే, వెంకయ్య ఉప్పొంగిపోయారు. 

ఎక్కడా, వెంకయ్యకు ఎలాంటి నిరసనల సెగా తగలకుండా చంద్రబాబు చేసిన ప్లానింగ్‌ బీజేపీ శ్రేణుల్ని సైతం ఆశ్చర్యపరిచిందట. తప్పదు మరి, కేంద్రంతో చంద్రబాబుకి చాలా అవసరాలున్నాయి. ఆ అవసరాలు తీరాలంటే, 'పెద్దన్న' వెంకయ్యను బాగా చూసుకోవాలి. అదే మరి, ఇక్కడ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు వెంకయ్యకు పట్టవు.. చంద్రబాబు సంగతి సరే సరి. కానీ, ఈ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటారు.. అవసరమైతే అధికారాన్నీ తమ అవసరాల కోసం వినియోగించేసుకుంటారు. ఇదండీ వెంకయ్య - చంద్రన్న దోస్తీ కా కహానీ.

Show comments