ఓ చిన్న పుకారు... చినికిచినికి గాలివానగా మారింది... ఎన్నికల నాటికి ప్రభంజనంగా తయారవుతుంది.. ప్రస్తుతానికి ఇది రూమరే. కానీ తెరవెనక మాత్రం ఈ రూమర్ ను నిజం చేసే ప్రయత్నాలు వందకు రెండొందల శాతం జరుగుతున్నాయి. చిరంజీవి రాజకీయాల నుంచి సినిమాల్లోకి వచ్చారు. పవన్ కల్యాణ్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు చిరు. కొత్తపార్టీని పాతుకుపోయేలా చేయాలనుకుంటున్నారు పవన్. మరి వీళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది. ఓ వర్గం వీళ్లను కలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని చాలా రోజులుగా వార్తలు వింటూనే ఉన్నాం.
కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా ఆ వర్గం ఎవరో చూచాయగా చాలామందికి తెలిసిపోయింది. టీవీ9 రవిప్రకాష్ కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కనిపించేసరికి చాలామంది ఆశ్చర్యపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు. ఈయనకు తోడుగా ఎన్టీవీ చౌదరి కూడా వచ్చారు. పవన్, రవిప్రకాష్ పక్కపక్కనే కూర్చున్నారు. ఇదంతా సహజమే అనుకోవద్దు. పవన్ మైక్ అందుకున్న వెంటనే అతడి నోటి నుంచి మొట్టమొదట వచ్చింది రవిప్రకాష్, చౌదరి పేర్లే అనే విషయాన్ని గుర్తుచేసుకోవాలి.
ప్రస్తుతం రవిప్రకాష్ టీవీ9లో తక్కువగా, ఎన్టీవీ ఆఫీస్ లో ఎక్కువగా ఉంటున్నారనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. టీవీ9ను మరో కార్పొరేట్ సంస్థకు అమ్మేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి టైమ్ లో రవిప్రకాష్ వెళ్లి ఎన్టీవీలో కూర్చోవడం చర్చనీయాంశమే. ఈ వ్యవహారానికి పవన్ కల్యాణ్ కు లింక్ ఉంది.
రవిప్రకాష్, ఎన్టీవీ చౌదరి కలిసి పవన్, చిరంజీవిని ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా... బిజినెస్ పరంగా కూడా వీళ్లిద్దర్నీ కలపాలనేది రవిప్రకాష్ ప్రయత్నంగా తెలుస్తోంది. త్వరలోనే టీవీ9 నుంచి బయటకు వచ్చేసి ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ తో పాటు కొత్తగా న్యూస్ ఛానెల్ పెట్టాలనే యోచనలో రవిప్రకాష్ ఉన్నారట. దీనికి పవన్, చిరంజీవి నుంచి ఫుల్ సపోర్ట్ ఆశిస్తున్నారాయన. అందుకే ఈ ప్రయత్నాలన్నీ.