నా మీద కేసులున్నాయ్‌.. కేసీఆర్‌ సంగతేంటి.?

'నా మీద 31 కేసులున్నాయట.. అలాగైతే కేసీఆర్‌ సంగతేంటి.?' 

- ఇదీ తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ప్రశ్న. 

పంచ్‌ పడింది కదూ.! తెలంగాణ జేఏసీ మీద 31 కేసులున్నాయి.. ఉద్యమంలోకి అసాంఘీక శక్తులు ప్రవేశించే అవకాశముంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ జేఏసీ చేపట్టిన నిరుద్యోగ ర్యాలీకి అనుమతిచ్చే ప్రసక్తే లేదు.. అంటూ తెలంగాణ పోలీస్‌, హైకోర్టుకి తేల్చి చెప్పింది. అయితే, షరతులతో కూడిన అనుమతినిచ్చేందుకు హైకోర్టు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. 

హైకోర్టు అనుమతిచ్చినా, ఆ అనుమతి మేరకు బహిరంగ సభ నిర్వహించలేమని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ తేల్చి చెప్పారు. నాగోల్‌ మెట్రో మైదానంలో ఇప్పటికిప్పుడు సభ నిర్వహణ అసాధ్యమని తేల్చిన కోదండరామ్‌, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి నిరుద్యోగ ర్యాలీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 'నా మీద కేసులున్నాయని కేసీఆర్‌ సర్కార్‌ చెబుతోంది.. మరి, నాతోపాటు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ మీద కూడా కేసులున్నాయి కదా.. నేను నిందితుడిగా వున్న ప్రతి కేసులోనూ కేసీఆర్‌ కూడా నిందితుడే..' అంటూ కాస్తంత ఆవేశంగానే కోదండరామ్‌ వ్యాఖ్యానించారు. 

నిరసన తెలపడం ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కు.. దాన్ని కాలరాస్తున్న కేసీఆర్‌, తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు కోదండరామ్‌. ఇలాగైతే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవాళ్ళమా.? అంటూ కేసీఆర్‌పై అసహనం వ్యక్తం చేశారాయన. 'మా డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తే, అసలు నిరుద్యోగ ర్యాలీ అన్న ప్రస్తావనే రాదు.. ఇప్పటికీ చెబుతున్నా.. ప్రభుత్వం స్పందిస్తే, మా ఆందోళన విరమిస్తాం..' అంటూ అంత అసహనంలోనూ కేసీఆర్‌ సర్కార్‌కి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించేశారు తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌. 

అయితే, కేసీఆర్‌కీ - కోదండరామ్‌కీ మధ్య 'ఇగో క్లాష్‌' సుష్పష్టం. ఈ నేపథ్యంలోనే ఇటు ఈయన, అటు ఆయన.. ఏమాత్రం తగ్గడంలేదాయె. మల్లన్నసాగర్‌ వివాదంతో కేసీఆర్‌, కోదండరామ్‌ మీద ఇంకాస్త 'అసహనం' పెంచుకున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. వెంకటేశ్వరస్వామి మొక్కులు తీర్చుకునేందుకు కాస్సేపటి క్రితం తిరుపతికి బయల్దేరారు కేసీఆర్‌. మరోపక్క, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాలీ జరిగి తీరుతుందని కోదండరామ్‌ ప్రకటించిన దరిమిలా.. ఈ ర్యాలీ తెచ్చిపెట్టే రాజకీయ గందరగోళమెలా వుంటుందో వేచి చూడాల్సిందే.

Show comments