డైరీ ఆఫ్‌ డీడీ : పరుగు బాబూ.. పెరుగు బాబూ!

అనగనగా ఒక ఊళ్లో ఉండే నా పేరు దానేశ్వరరావు. మా ఇంటి పేరు 'దారినపోయే'. వెరశి ఏక మొత్తంగా అభిమానులు మరియు ఫ్యాన్స్‌ మరియు ఎరిగిన వారు మొత్తమునూ కలిసి మనల్ని దారినపోయే దానయ్య అని పిలుస్తుంటారు. కొందరు డీడీ అని పిలుస్తుండడము కద్దు. నాకు డైరీ రాయడం అనగా బహు ఇష్టము. డైరీ అనునది మన సమకాలీన చరిత్రను నిక్షిప్తీకరించుట అగును. మన భావి తరముల వారు మనలను బహుధా స్మరించుకుని, మనకు శిలా విగ్రహములు పెట్టించి ఆరాధించవలెనన్న.. ఈ రీతిగా మనము ఇప్పుడు సంపాదిస్తున్న జ్ఞానాన్ని డైరీ ద్వారా భావితరాలకు వారసత్వముగా అందించవలసి ఉన్నది. డైరీ ముచ్చట్లు మరికొన్ని ముందుముందు తెలియజేయుదును. 

ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరుగు గురించి తన అమూల్యాభిప్రాయములను వెల్లడించిన తీరు నాకు బహు ముచ్చటగా అనిపించినది. విశాఖ ఇసుకలో పరుగును ప్రారంభించినారు గనుక పరుగు ఆవశ్యకతను మరియు పరుగు మనకు కలిగించగల ఆరోగ్యమును చంద్రబాబు చాలా చక్కగా వివరించారు. నేల మీద కంటె ఇసుకలో పరుగులిడుట చాలా ఆరోగ్యదాయకము. ఎందుకంటే ఇసుకలో కాళ్లు కూరుకుపోవును. వాటిని బయటకు లాగి పరుగులిడుట శారీరక శ్రమకు తద్వారా ఆరోగ్యమునకు ఎంతగానో దోహదము చేయును. ఇసుకలోకంటె బురదలో పరుగులిడిన కాళ్లు మరింతగా కూరుకుపోవును. -ఇన్‌ రిటర్న్‌- మరింత ఆరోగ్యము ప్రాప్తించును! వెలగపూడి అను చోట సచివాలయ భవనములను నిర్మించి, వాటి చుట్టూతా బురదక్షేత్రములను ఏర్పాటు చేయుటలో చంద్రబాబుకు బహుశా ఇది ఒక విజన్‌ అయి ఉండవచ్చును. ఉద్యోగుల ఆరోగ్యము మీది ప్రేమతో బురద ట్రాక్‌లను ఏర్పాటు చేయగల ఆయన అప్రకటిత ప్రేమాదరణలకు వారందరనూ బహుధా నివాళి మరియు జోహారులు అర్పించవలసి ఉన్నది. ఈ పరుగుల వ్యవహారముతో ఆయన మరింతగా పెరగవలెనని కోరిక.

సైకిలు గీత 
నగరాలలో ప్రజారోగ్యముపై చంద్రబాబుకు మరింత శ్రద్ధకు నిదర్శనము సైకిళ్ల ఉద్యమం. అన్ని నగరాల్లో సైకిళ్లు అందుబాటులో ఉంచుతాము అంటూ ఆయన సెలవిచ్చారు. సైకిలు తొక్కితే ఆరోగ్యం వస్తుందని సీక్రెటు కూడా విప్పినారు. తొక్కి ఎక్కునది సైకిలు, ఎక్కి తొక్కునది మోటారు సైకిలు అను సత్యము అందరికీ తెలిసినదే. అందుకే చంద్రబాబు సైకిలు గురించి సెలవిచ్చారు. పైగా అది ప్రజలు అభిమానించే తమ పార్టీ గుర్తు అని గుర్తు చేసుకున్నారు. (పునరుక్తి అలంకారముగా వాడబడినది. దోషముగా ఎంచరాదు). భగవద్గీత వలె ఇక్కడ 'సైకిలు గీత'ను కొద్దిగా స్మరించుకొనవలెను. 

సైకిలు వాడువారు రెండు రకములు. ఎక్కువారు మరియు తొక్కువారు. ఎక్కువారు అందరునూ తొక్కువారు అయిఉండవలసిన అసవరము లేదు. కానీ తొక్కువారు అందరూ విధిగా ఎక్కువారు అయి ఉండుట తటస్థించుతూ ఉండగలదు. తొక్కలేని ఎక్కువారికి తొక్కువారి ఆవశ్యకత ఉండును. లెక్కలేకుండా తొక్కువారికి తప్పనిసరిగా సైకిలు ఆవశ్యకత ఉండును. ఏమిటో- ఈ వ్యాఖ్యానములో కొంత గందరగోళము అనే అలంకారము ఎలిమెంటు వాడినట్టున్నాను. పరిహరించవలెను. 

సైకిలు వాడు వారిలో మరో రెండు రకములుండును. వారు సైకిలు మోయువారు మరియు మోయబడువారు. (ఈ రెండు రకములూ పార్టీ సైకిలుకు ప్రత్యేకించినవి అని గమనించగలరు). తొక్కువారికి ఆరోగ్యము దక్కునటులగానే.. మోయు వారికి భుజముల తీపులు, నడుము నొప్పులు, కాలి పిక్కల పట్టివేత వంటి శుభలక్షణములు దక్కగలవు. మోయబడు వారికి అధికారము ప్రాప్తించును. మరో రకముగా అధికారములోని వారే మోయబడుదురు. మామూలు సైకిళ్ల పరిభాషలో అయితే ఈ అధికారము దక్కించుకున్న నాయకులు... సైకిలు తొక్కువారిని ఎక్కువారుగా... గుర్తింపు పొందుదురు. వారికి ఆరోగ్యమేం ఖర్మ... ఆదాయము మెండుగా ఉండగలదు. 

ప్రజారోగ్యము గురించి ఇవాళ చంద్రబాబునాయుడు కనబరచిన ఆసక్తికి మురిసిపోతూ నా డైరీని ఆపుతున్నాను. రేపటిలోగా నా జ్ఞానానికి మరింతగా పదును పెట్టవలెను. 

- దారినపోయే దానయ్య 

జ్యేష్టబహుళ చతుర్దశి, దుర్ముఖి అనగా 7 జులై 2016

Show comments