మురుగు సమాజం చానల్.. ఇదే ప్రశ్న వాళ్లనూ..?

మెరుగైన సమాజం కోసం.. అని చెప్పుకునే మురుగు చానల్ “ఛీ’’ కొట్టించుకోవడం లో తన పంథాను ఏ మాత్రం మార్చుకోవడం లేదని స్పష్టం అవుతోంది. ఈ మధ్య ఈ ఛానల్ ప్రతినిధి అంటూ ఒక అరాజక వాది రంగంలోకి దిగాడు. ఇంటర్వ్యూ పేరుతో అటు అవతల వాళ్లను, ఇటు చూసే వాళ్లను ఇరిటేట్ చేయడమే వీడి పని! ఇతగాడి ఇంటర్వ్యూల తీరును చూసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నెటిజన్లు. సమాజంలో ఎవరైనా ప్రముఖుడితో ఇంటర్వ్యూ చేస్తే.. అతడి గురించి జనాలకు తెలియని విషయాలను తెలియజేయడమో, అతడిని జనాల ముందు కొత్త ఆవిష్కరణ చేయడమో జరుగుతుందని అనుకుంటాం.. కానీ ఎంతసేపూ దిగజారి పోయి.. లేకి ప్రశ్నలు అడగడం తప్ప ఇంకోటి ఉండదు!

ఆ మధ్య చాగంటితో ఇంటర్వ్యూ లో ఈ యాంకర్  తీరును చూసి.. “వీడేం మనిషి.. ఇదేం చానల్..’ అంటూ కొంతమంది నెటిజన్లు విరుచుకుపడ్డారు. “మీరు అవినీతి చేశారా.. మంది సొమ్ము తినేశారా..’’ అంటూ ఆ ప్రవచన కారుడిని పట్టుకుని ఏదో స్కామ్ లో నిందితుడిని అడిగినట్టుగా ప్రశ్నలు అడిగిన తీరును చూస్తే.. ఇదా నంబర్ వన్ చానల్ బతుకు అనిపించకమానదు!

ఇక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాతో ఈ యాంకర్ వ్యవహరించిన తీరును చూస్తే.. “వీడి మీద నిర్భయ కేసు పెట్టి కుళ్లబొడిచినా తప్పులేదు..’’ అనే కామెంట్ వినిపించింది సోషల్ మీడియా నుంచి.

తాజాగా సునీల్ తో ఒక పెంటర్వ్యూ జరిగింది. ఇందులో యాంకర్ వెకిలి వేషాలకు కొదవేలేదు! హీరోగా తన ప్రయత్నాలేవో తను చేసుకొంటున్న సునీల్ ను ఉద్దేశించి.. “మీకు హీరో ఫీచర్లు ఉన్నాయని అనుకుంటున్నా..అద్దం లో మీ మొహాన్ని ఎప్పుడైనా చూసుకుని.. హీరోగా సెట్ అవుతానని అనుకున్నారా?’’ అంటూ ప్రశ్నలు అడిగాడు. అడిగేది చెత్త ప్రశ్నలు.. పై పెచ్చూ “నా ప్రశ్నలు సూటిగా ఉంటాయి..’’ అంటూ చెప్పుకోవడం!

మరి హీరోకి గ్లామర్ అవసరం.. గ్లామర్ లేకపోతే హీరోని ఆదరించే అవకాశాలు ఉండవు.. అని తేల్చేసిన ఈ మురుగు సమాజపు చానల్ ప్రతినిధి.. ఇవే ప్రశ్నలను ఎవరైనా సినీ వారసుడిని అడగగలడా? ముక్కూమొహం కూడా సరిగా లేని ఎంతోమంది “సర్జరీ’’ హీరోలు టాలీవుడ్ లో నెలకు ఒక దండయాత్ర చేస్తూనే ఉన్నారు కదా.. వారిని ఇదే ప్రశ్న అడగగలరేమో.. ఆ స్టార్ల తనయులను ఇలాగే ఇరిటేట్ చేయగలరేమో ఈ పెంటర్వ్యూయర్లు  ఆత్మవిమర్శ చేసుకోవాలి!

అయినా.. ఆత్మ విమర్శ చేసుకునే వాళ్లే అయితే.. సునీల్ ను కులం గురించి ప్రశ్నలు అడుగుతారా? ఒకవైపు ఆ ఛానల్ ఏమో పేరు ముందు కులాల తోకలు కట్ చేయండి.. అని జాతికి సందేశం ఇస్తారు, మళ్లీ ఇక్కడేమో “మీరు సునీల్ వర్మ కాకపోతే ఈ స్థాయికి వచ్చేవారా?’’ అంటూ ప్రశ్నిస్తారు! మరి ఇదే ఛానల్లో దేనికో ..”చెప్పుతో కొట్టండి’’ అనే పిలుపును కూడా ఇస్తూ ఉంటారు. మరి ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడూ అదే పని చేస్తే పోయేదేమో!

Show comments