పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమే అనైతికం. అనైతిక చర్యకు పాల్పడి, నైతికత పేరుతో లెక్చర్లు దంచడం హీనాతిహీనం.
నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీ 'వ్యూహం' అప్పుడే బెడిసికొట్టేసింది. 'సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో తలెత్తిన ఉప ఎన్నికల్లో సెంటిమెంట్‌ని గౌరవించి ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిది..' అని టీడీపీ నేతలు కొందరు అత్యుత్సాహంతో మీడియా ముందుకొచ్చేశారు.
నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఉప ఎన్నికతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే. భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
కానీ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది.? వైఎస్సార్సీపీనే కదా. ఆ లెక్కన బరిలో నిలవాల్సింది వైఎస్సార్సీపీ, తప్పుకోవాల్సింది టీడీపీ.!
ఇప్పుడిదే విషయమై సోషల్ మీడియాలో చంద్రబాబు అండ్ టీమ్‌ని కడిగి పారేస్తున్నారు నెటిజన్లు. అలా ఇలా కాదు, ఓ రేంజ్‌లో కడిగి పారేస్తుండడంతో టీడీపీ నేతలు తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ రోజుల్లో సోషల్ మీడియా, రాజకీయాల్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఇతర పార్టీలు బరిలోకి దిగొద్దు మొర్రో..' అని టీడీపీ వేడుకోవడం, ఇప్పుడు ఆ పార్టీ నేతలకే రుచించడంలేదు. 'ఇదేం దేబిరింత..' అని ఒకర్ని ఒకరు విమర్శించుకుంటున్నారు టీడీపీలో.
'చేసిందే తప్పు.. దాన్ని కవర్ చేసుకునేందుకు ఇంత దేబిరింతా.? గెలవలేని చేతకానితనాన్ని ప్రదర్శించేశాం..' అంటూ కర్నూలు జిల్లా రాజకీయాలపై ఇప్పటిదాకా మాట్లాడిన నేతలపై టీడీపీలోనే కొందరు నేతలు గుస్సా అవుతున్నారు.
ఈ వ్యవహారం చంద్రబాబుదాకా వెళ్ళడంతో, 'అప్పుడే ఎన్నికల్లేవు కదా.. ఇంత తొందరగా ఇతర పార్టీలకు అప్పీల్ చేయాల్సిన అవసరమేముంది.?' అంటూ ఆయన రివర్స్ గేర్ వేసేశారట. 'అదేంటీ, మీరే కదా.. అలా మాట్లాడమన్నది..' అంటూ చంద్రబాబు రివర్స్‌గేర్ నేపథ్యంలో కర్నూలు టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.