సంతలో పశువులంటే తప్పేంటి.?

రాజకీయాలన్నాక పార్టీ ఫిరాయింపులు మామూలే.! అవును మరి, ఇది నయా రాజకీయం. విలువల వలువలూడిపోయాయెప్పుడో.! తమ రాజకీయ అవసరాలు తప్ప, ఇంకో ఆలోచనలు రాజకీయ నాయకులకు లేవు. మెజార్టీ రాజకీయ నాయకులు అనుసరిస్తున్న పంథా ఇదే. 'సంతలో పశువుల్లా అమ్ముడుపోతున్నారు..' అని ఆరోపిస్తున్నవాళ్ళే, అమ్ముడుపోయేందుకు సిద్ధమవుతున్నారు నిస్సిగ్గుగా. రాజకీయ వ్యభిచారమని ఆరోపించేవాళ్ళే, ఆ రాజకీయ వ్యభిచారం చేయడంలో మాస్టర్‌ డిగ్రీ పొందుతున్నారు. ఇదే మరి, రాజకీయం అంటే. 

పార్టీ ఫిరాయింపులకు తెలుగు రాష్ట్రాలు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారిపోయాయి. ఇప్పుడు 'సంతలో పశువులు' అన్న మాటకి తమిళనాడు రాజకీయం బ్రాండ్‌ అంబాసిడర్‌లా తయారయ్యేలా వుంది. తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ నానా పాట్లూ పడుతున్నారు. మొత్తం 129 ఎమ్మెల్యేల్ని శశికళ 'దాచేశారు'. కానీ, అందులోంచి ఒకరొకరుగా జారిపోతున్నారు. ఈ జారిపోవడం మామూలే అయినా, జారిపోతున్నోళ్ళు 'మాకు తిండి కూడా పెట్టడంలేదు మొర్రో..' అంటూ ఆరోపిస్తుండడమే ఇక్కడ విశేషం. రిసార్ట్‌ల్లో ఎమ్మెల్యేలను దాచిన శశికళ, వారికి 'సకల ఏర్పాట్లు' చేయడంలో విఫలమయ్యారట. 

మామూలుగా అయితే, ఈ తరహా 'క్యాంప్‌' రాజకీయాలు భలే రిచ్‌గా వుంటాయి. గానా భజానా వుంటుంది.. ఇంకా చాలా చాలా 'లగ్జరీస్‌' వుంటాయక్కడ. శశికళ మాత్రం అవేమీ ఏర్పాటు చేయకపోవడంతో, సహజంగానే ఎమ్మెల్యేలు జారిపోతుంటారు. ఏం, సౌకర్యాలు కల్పిస్తేనే ఎమ్మెల్యేలు క్యాంపుల్లో వుంటారా.? అనడక్కండి. అలా అలవాటుపడిపోయారు మరి.! ఏదో, కొనేశాం సంతలో పశువుల్లా.. అని సరిపెట్టుకుంటే కుదరదు. వాటిని పెంచి పోషించాలి కదా. అదీ అసలు విషయం. రాజకీయం ఇంత జుగుప్సాకరంగా తయారయ్యాక.. రాజకీయ నాయకుల్ని సంతలో పశువులంటే తప్పేంటట.?

Show comments