ఐరాస.. నిద్రలేచిందోచ్!

అవును.. ఐక్యరాజ్యసమితి నిద్రలేచింది. ఇన్ని రోజులూ గాఢనిద్రలో జోగిన ఈ సంస్థ ఒక్కసారి గా ఉలిక్కి పడి నిద్రలేచింది. ఇండోపాక్ సరిహద్దుల్లో ఏదో జరిగిపోతోందని భయపడిపోతోంది. ఆందోళన చెందుతోంది. ఆపండని విజ్ఞప్తులు చేస్తోంది. శాంతి ప్రవచనాలు వల్లె వేస్తోంది. ప్రపంచం శాంతీయుతంగా ఉండాల్సిన అవసరాలను గుర్తు చేస్తోంది. సహనం వహించాలని అంటోంది. అశాంతి మంచిది కాదు.. నాకు భయంగా ఉంది.. అంటోంది!

అయితే ఎటొచ్చీ ఉగ్రవాదులు మరణించేసరికి ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతుండటమే ఇక్కడ గమనించాల్సిన అంశం. దశాబ్దాలుగా పాక్ ముష్కరులు సృష్టించిన అశాంతి విషయంలో ఐరాస ఈ మాత్రం స్పందించలేదు. పాక్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది.. అంటూ పలు సార్లు అంతర్జాతీయ వేదికల్లో, ఐరాసాలో ఇండియా ఆందోళన వ్యక్తం చేసినా.. కనీసం హితబోధ చేయలేకపోయిన దద్దమ్మ ఐరాస.

లష్కేరే, జైషే.. వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆటపట్టు అయ్యింది.. లాడెన్ కు ఆశ్రయమిచ్చింది కూడా పాకిస్తానే.. దావూద్ తో సహా అనేక మంది అంతర్జాతీయ ఉగ్రవాదులు పాక్ లోనే ఉన్నారనేందుకు అనేక ఆధారాలు ఉన్నా.. ఐరాస పాక్ ను పల్లెత్తు మాట అనలేదు. ఐరాసా చెప్పినా పాక్ వినదు. అది నిజం. కానీ.. ఐరాస పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది అనే విషయాన్ని గుర్తు చేయలేదు!

పైపెచ్చూ… మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా..పాకిస్తాన్  ఐరాసాను వేదికగా వాడుకోవడం జరుగుతూ వచ్చింది. తనకు ఏ మాత్రం సంబంధం లేని అంశం అయిన కాశ్మీర్ గురించి పాక్ పలు సార్లు ఐరాసలో మాట్లాడింది. అక్కడ హక్కుల ఉల్లంఘన జరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అర్థం లేని అలాంటి వాదనలను పాక్ వినిపించగా.. ఐరాస అందుకు అవకాశం ఇచ్చింది.

ఇక ఊడీ ఉగ్రవాద సంఘటన అనంతరం కూడా.. పాక్ ను ఐరాస పల్లెత్తు మాట అనలేదు. ఇదేంటి? అంటూ నిలదీసే యత్నం చేయలేదు!

కానీ.. ఇప్పుడు మాత్రం ఐరాస తెగ భయపడిపోతోంది.. ఆందోళన వ్యక్తం చేస్తోంది.. శాంతి, శాంతి అంటోంది. మొత్తానికి ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు ఏదీ మినహాయింపులా కనిపించడం లేదు. సిగ్గులేని ప్రపంచం ఇది!  అయినా.. పీవోకే భారత్ అంతర్భాగం…అలాంటి చోట ఆత్మరక్షణ కోసం భారత్ చేపట్టిన చర్యలతో ఐరాసకు నొప్పి ఏమిటో!

Show comments