ప్రకంపనలు సృష్టిస్తున్న 'దొంగతనం'

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ 'దొంగతనం' ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతే కాదు, ఇది తెలంగాణలోనూ రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యింది. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోందిప్పుడు ఈ 'దొంగతనం'. ఇంతకీ, ఈ 'దొంగతనం' ఏంటో తెలుసా.? ఇది రాజకీయ దొంగతనం. అవును, ఇది టీడీపీ చేసిన దొంగతనం.. అదీ ఎమ్మెల్యేల దొంగతనం. 

రాజకీయ వ్యభిచారం గురించి విన్నాం.. సంతలో పశువుల్ని కొనడం గురించి విన్నాం.. ఎమ్మెల్యేల దొంగతనం గురించి విన్నామా.? దొంగ సొత్తు గురించి ఎప్పుడైనా విన్నామా.? లేదు, ఇప్పుడు కొత్తగా వింటున్నాం ఈ సరికొత్త పదాల్ని. దొంగతనం జరిగింది నిజం. కానీ, ఆ దొంగతనం కళ్ళెదుట కన్పిస్తున్నా.. శిక్షించేవారే లేరిక్కడ. శిక్ష విధించాల్సిన పెద్దాయన, 'విశేష అధికారాల' పేరుతో కాలయాపన చేస్తున్నారు మరి.! 

తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ ఫిరాయింపులపై స్పీకర్లు ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అధికార పార్టీలు ఏం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారమన్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో ఆ నీఛమైన పనిని తానే స్వయంగా ప్రోత్సహిస్తున్నారు. ఏమిటీ అన్యాయం.? అని ప్రశ్నిస్తే, 'అలా ప్రశ్నించడమే నేరం..' అంటున్నారాయన. అందుకే, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, బహిరంగ లేఖాస్త్రం సంధించారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌కి. 

తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు దొంగిలించబడ్డారన్నది వైఎస్‌ జగన్‌ ఆరోపణ. దొంగతనం చేసింది సాక్షాత్తూ చంద్రబాబేనని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 'దొంగ సొత్తు..' అంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైనా ఆరోపణలు చేశారు. అంతే, అధికార పార్టీలో ఆందోళన షురూ అయ్యింది. అది అక్కసుగా మారింది. అప్పుడే వైఎస్‌ జగన్‌ మీద విమర్శలూ షురూ అయ్యాయి. అయితే, 'తేలు కుట్టిన దొంగలు' మాత్రం కిమ్మనకుండా వున్నారు. అవును మరి, ఏ మొహం పెట్టుకుని, 'మేం దొంగ సొత్తు కాదు.. మేం దొంగిలించబడలేదు..' అని పార్టీ ఫిరాయించిన నేతలు చెప్పుకోగలరు.? ప్రస్తుతానికైతే సైలెంట్‌గా వున్నారు. ఏమో, రేప్పొద్దున్న 'మేం రాజకీయ నాయకులం.. మాకు నైతిక విలువల్లేవు..' అని బాహాటంగా చెప్పుకున్నా చెప్పుకుంటారేమో.! 

కొత్త రాష్ట్రం.. కొత్త అసెంబ్లీ.. అందులో, సరికొత్తగా.. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఓ రాజకీయ విమర్శ దూసుకొచ్చింది. ఇప్పుడిక బంతి స్పీకర్‌ కోర్టులో వుంది. ప్రతిపక్ష నేత 'దొంగతనం' అని ఆరోపించాక, 'దొంగ సొత్తు' అని మండిపడ్డాక, దొంగిలించారని ఫిర్యాదు చేశాక.. కొత్త అసెంబ్లీ వేదికగా స్పీకర్‌ ఎలా ఈ వ్యవహారంపై పెదవి విప్పుతారు.? దొంగతనం నేరం.. ఇది అందరికీ తెల్సిన విషయమే, మరి.. ఆ దొంగతనాన్ని చూస్తూ ఊరుకుంటే, దాన్నేమనాలి.?

Show comments