ఇక 'మన' మీడియాలో వార్తలు మారతాయా?

మీడియా స్టాండ్ అన్నది జర్నలిస్టుల భావజాలాన్ని, వాస్తవ పరిస్థితులను బట్టి కాకుండా, మేనేజ్ మెంట్ ఇష్టాఇష్టాలను, అవసరాలను బట్టి వుండడం అన్నది తెలుగునాట గడచిన ముఫై ఏళ్లుగా కామన్ అయిపోయింది. గడచిన మూడేళ్లుగా మోడీని, భాజపాను మోస్తున్నాయి మన పత్రికలు కొన్ని. ఇదంతా కేవలం తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు నాయడు కోసం, ఇంకా మాట్లాడితే ముప్పవరపు వెంకయ్య నాయుడు కోసం తప్ప, మోడీ మిత్రుడనో, భాజాపాతో సైద్ధాంతిక సంబంధాలు వున్నాయనో కాదు. 

అయితే ఇప్పుడు ఒకటి రెండు పత్రికల స్టాండ్ మారుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న 'పాపం వెంకయ్య' అంటూ వచ్చిన కాలమ్ కాస్త గట్టి ప్రకంపనలే సృష్టించినట్లు కనిపిస్తోంది. నిజంగానే పాపం వెంకయ్య, ఎవరో రాసిన దానికి తాను సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ అదే సమయంలో భాజపా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ మాధవ్ కూడా పరోక్షంగా అయినా గట్టిగానే స్పందించారు. వ్యక్తులు, వాళ్ల కోరికలు కాదు, పార్టీ ముఖ్యం, రాజకీయాలు అంటే ఛారిటీ కాదు, నిర్ణయాలు తీసుకోవాల్సింది పార్టీ కానీ, మీడియా కాదు అంటూ కుండ బద్దలు కొట్టారు. పైగా ఛారిటీ అనగానే వెంకయ్య నాయుడు అనునాయులు భుజాలు తడుముకుంటారు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీకి స్వర్ణభారతి ట్రస్ట్ వుంది. ఈ మధ్యనే దానికి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రెండు కోట్లకు పైగా లబ్ది చేకూర్చింది. అదంతా వేరే సంగతి. రామ్ మాధవ్ ఇలా అంటే, భాజపా స్ట్రాంగ్ సపోర్టర్లు సోషల్ మీడియాలో ఆ ఆర్టికల్ మీద కాస్త గట్టిగానే విరుచుకు పడ్డారు. 

ఇదిలా వుండగానే తెల్లవారి రెండు కీలకమైన వార్తలు మళ్లీ కనిపించాయి. ఒకటి, నోట్లరద్దు కారణంగా నిర్మాణ రంగం కుదేలయిందని, అభివృద్ధి రేటు పడిపోయిందని, జనాలకు ఉపాధి పోయిందని, ఇలా డిటైల్డ్ గా. ఇది పార్లమెంట్ లో అందిన నివేదిక ప్రకారం రాసిందే. కానీ ఇక్కడ విషయం ఇది కాదు. గతంలో ఇలాంటి వార్తలు అంత ప్రాధాన్యత లేకుండా వుండిపోయేవి. ఇప్పుడు ప్రామినెంట్ గా కనిపించడం ప్రారంభమైంది. అలాగే రాష్ట్రానికి అప్పులు అందకుండా, వెసులుబాటులు ఇవ్వకుండా కేంద్రం మోకాలు అడ్డుతోందని, అస్సలు రాష్ట్రం పరిస్థితిని ప్రత్యేకంగా చూడడం లేదని. 

భాజపా మీద ఈగ వాలే వార్తలు గతంలో అంతగా కనిపించేవి కాదు. ఎందుకంటే వెంకయ్య నాయుడు ఫీల్ అవుతారని అని అనుకోవాలి. కానీ ఇక ఇప్పుడు ఆ సమస్య లేదు. వెంకయ్యకు రాజకీయాలు, భాజపా పనితీరు, రాష్ట్రంలో ఎదగడం వంటివి ఇప్పుడు అంతగా పట్టకపోవచ్చు. పైగా బాబు దారిలోకి భాజపా రావాలంటే, ఇక్కడ కాస్త గట్టిగానే వార్తలు పడాలి. హోదాను దిగ్విజయంగా ఎలాగూ తొక్కేసారు. కానీ ఇకపై కేంద్రానికి సంబంధించి కాస్త గట్టి నిజాలు బయటకు వస్తాయేమో? ఇప్పుడయినా? 

Show comments