ఆ సినిమాని నిషేధిస్తే నష్టమెవరికి.?

'ఏ దిల్‌ హై ముష్కిల్‌' సినిమా వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమాని ప్రదర్శించేందుకు తాము సుముఖంగా లేమంటూ నాలుగు రాష్ట్రాల్లోని సింగిల్‌ థియేటర్‌ ఓనర్స్‌ తెగేసి చెప్పారు. మల్టీప్లెక్సుల్లో మాత్రం ఈ సినిమా విడుదల కానుంది. అక్టోబర్‌ 28న ఈ సినిమా విడుదల కావాల్సి వుంది. సినిమా విడుదలకు థియేటర్ల యాజమాన్యాలు అంగీకరించకపోవడానికి కారణం భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్‌ నటులు నటించిన సినిమాల్ని ఇండియాలో విడుదల కానివ్వబోమని థియేటర్‌ యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. 

అయితే, కొత్తగా పాక్‌ నటులతో సినిమాలు చేయొద్దనడం వరకూ బాగానే వుంటుందేమోగానీ, సినిమా నిర్మాణం పూర్తయ్యి.. విడుదల సమయంలో, పాక్‌ నటులు నటించిన మన సినిమాల్ని మనం బ్యాన్‌ చేసుకోవడం ఎంతవరకు సబబు.? అన్నదే ఇక్కడ ముఖ్యమైన అంశం. నిజమే మరి, ఫవాద్‌ ఖాన్‌ (యే దిల్‌ హై ముష్కిల్‌ సినిమాలో నటించిన నటుడు) ఆల్రెడీ పాకిస్తాన్‌కి చెక్కేశాడు. పైగా, తన రెమ్యునరేషన్‌ని ఫుల్లుగా ఇప్పటికే లాగేసుకున్నాడు కూడా. 

సో, ఇప్పుడు సినిమా విడుదల కాకపోతే నష్టపోయేది నిర్మాత కరణ్‌ జోహార్‌ మాత్రమే. చాలాకాలం తర్వాత ఐశ్వర్యారాయ్‌ బోల్డ్‌గా నటించిన సినిమా ఇది. ఇందులో ఐశ్వర్యారాయ్‌, అనుష్క శర్మ, రణ్‌బీర్‌కపూర్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదేమీ పూర్తిగా ఫవాద్‌ ఖాన్‌ సినిమా కాదు, బ్యాన్‌ చేసెయ్యడానికి. అయితే, పాక్‌ నటులపై నిషేధాన్ని కరణ్‌ జోహార్‌ తప్పు పట్టడంతో అతనికీ తగిన శాస్తి జరగాల్సిందేనని కొందరంటున్నారు.

Readmore!
Show comments