'గౌరవపూర్వకంగా' కడిగిపారేసిన వర్మ

'లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా..' అంటూ 'అత్తారింటికి దారేది' సినిమాలోని పవన్‌కళ్యాణ్‌ డైలాగ్‌ గుర్తుకు తెచ్చుకున్నాడేమో, అప్పటిదాకా 'కడిగి పారేసి', చివర్లో 'గౌరవపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను..' అంటూ ముగించాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇంతకీ, వర్మ కడిగి పారేసిందెవర్నో తెలుసా.? తెలుగు ఫిలిం ఛాంబర్‌ పెద్దల్ని.! 

డ్రగ్స్‌ కేసులో సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 'సిట్‌' విచారణకు పిలవడం, విచారణ చేపట్టడంపై గతంలోనే వర్మ 'అసహనం' వ్యక్తం చేశాడు. విచారణకు పిలిచిన తీరు, విచారణ జరుగుతున్న తీరుపై వర్మ అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తే, దానికి 'సిట్‌' కూడా కౌంటర్‌ ఇచ్చింది. ఆ వ్యవహారమలా వుంటే, తెలుగు సినీ పరిశ్రమ తరఫున కొందరు వర్మపై మండిపడ్డారు కూడా. 

ఇక, మొన్నీమధ్యనే తెలుగు ఫిలిం ఛాంబర్‌ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పంపిన ఈ లేఖలో, తెలుగు సినీ పరిశ్రమ 'క్షమాపణ' చెప్పడం వర్మకి నచ్చలేదు. 'అతి కొద్ది మంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలదించుకోవాల్సి రావడం చాలా బాధాకరం' అన్న ప్రస్తావన వర్మకి ఆగ్రహం తెప్పించింది. 'ఎవరు చెప్పారు, ఆ కొద్ది మంది దోషులని..' అంటూ వర్మ ఫిలిం ఛాంబర్‌కి రాసిన లేఖాస్త్రంలో ప్రశ్నించాడు. 

నిజమే మరి, ఫలానా హీరో లేదా ఫలానా దర్శకుడు లేదా ఫలానా నటి లేకపోతే ఇంకొకరు టాలీవుడ్‌లో డ్రగ్స్‌ బాధితులని తెలంగాణ ఎక్సయిజ్‌ శాఖ అధికారికంగా ప్రకటించనప్పుడు 'కొందరు తప్పు చేశారు' అని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఒప్పుకోవడమంటే, అంతకన్నా బాధ్యతారాహిత్యం ఇంకొకటుండదు. ఇదే విషయాన్ని వర్మ ప్రశ్నిస్తూ, టాలీవుడ్‌ని కడిగి పారేశాడు. వర్మని మినహాయిస్తే, సినీ పరిశ్రమ నుంచి జీవిత ఒక్కరే ఇప్పటిదాకా, జరిగిన వ్యవహారంపై నిక్కచ్చిగా స్పందిస్తూ వచ్చారన్నది నిర్వివాదాంశం. 

నిజానికి, ఈ వ్యవహారం వెలుగు చూసిన వెంటనే 'మా' కంగారు పడింది. 'కొందరు డ్రగ్స్‌ తీసుకుంటున్న మాట వాస్తవమే..' అంటూ ధృవీకరించేసింది. ఈ వ్యవహారం అప్పట్లోనే పెద్ద దుమారానికి కారణమయ్యింది. కొందర్ని బలిపశువుల్ని చేసే ప్రయత్నంలో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు కొందరు అత్యుత్సాహం చూపుతున్నారన్న వాదనలూ లేకపోలేదు. 

మొత్తమ్మీద, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బహిరంగ లేఖలు రాయాలంటూ వర్మ పిలుపునిచ్చి, తెలుగు సినీ పరిశ్రమకి పెద్ద షాకే ఇచ్చాడు. తెలుగు ఫిలిం ఛాంబర్‌ని ప్రశ్నిస్తూ తాను బహిరంగ లేఖ రాసిందిగాక, ఇతరుల్నీ రాయమంటున్న వర్మ, ఈ క్రమంలో ఎంతమేరకు తనకు మద్దతుని పెంచుకుంటాడో వేచి చూడాల్సిందే.

Show comments