రామోజీపై.. సాక్షిలో ఆసక్తికర కథనం!

రామోజీ గ్రూప్ అధిపతి సీహెచ్ రామోజీరావుపై సాక్షి బిజినెస్ లో ఆసక్తికరమైన కథనం ప్రచురితం అయ్యింది. రామోజీని బిలియనీర్ గా అభివర్ణిస్తూ ఆ కథనం సాగింది. అయితే “అయనే అయ్యుండొచ్చు.. ‘’ అంటూనే “ఆయనే’’ అన్నట్టుగా ఉంది ఈ కథనం. “న్యూ వరల్డ్ వెల్త్’’ నివేదికను ఆధారంగా చేసుకుని ఈ కథనాన్ని రాశారు. దేశంలో మిలియనీర్ల, బిలియనీర్ల గురించి ఆ సంస్థ విడుదల  చేసిన నంబర్లను ఆధారంగా చేసుకుని “సాక్షి’’అందులో రామోజీ పేరును ప్రస్తావించింది. ఆయనను “బిలియనీర్’’ గా అభివర్ణించింది.

దేశంలోని ప్రముఖ నగరాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది బిలియనీర్లు ఉన్నారనే అంశం గురించి న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం హైదరాబాద్ కు సంబంధించి ఏడు మంది బిలియనీర్లు ఉన్నారట. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీల్లో వాటాలను బట్టి వారిని బిలియనీర్లుగా గుర్తించిందట ఆ సంస్థ. అయితే 6,500 కోట్ల రూపాయలు, అందుకు పై స్థాయి ఆస్తులు కలిగిన ఆ ఏడు మంది హైదరాబాదీ వ్యాపార వేత్తలు ఎవరో  ఆ సంస్థ పేర్కొనలేదు. 

ఆ ఏడుమంది ఎవరయ్యుంటారు.. అనే అంచనాలు వేస్తూ రామోజీ పేరును ప్రస్తావించింది సాక్షి. అరబిందో ఫార్మా ప్రమోటర్లు నిత్యానందరెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి.. దాదాపు ఇరవై ఐదు వేల కోట్లమార్కెట్ విలువ కలిగిన ఆ సంస్థలో వీరి కుటుంబానికి దాదాపు 47శాతం వాటా ఉందట.

తొమ్మిది వేల కోట్ల రూపాయల పైస్థాయి మార్కెట్ విలువ ఉన్న అమర్ రాజా సంస్థలో 52 శాతం వాటా ఉన్న గల్లా కుటుంబం కూడా బిలియనీర్ల క్లబ్ లో ఉండవచ్చని సాక్షి అంచనా.

ఇక దివీస్ ల్యాబొరేటరీస్, రెడ్డీస్ ల్యాబ్, అపోలో గ్రూప్..లో ప్రధాన వాటా దారులు. ఈ ఐదు మందీ లిస్టెడ్ గ్రూప్స్ వాటా దారులుగా హైదరాబాదీ బేస్డ్ బిలియనీర్స్ అయ్యుండవచ్చు.

ఇక “న్యూ వరల్డ్ వెల్త్’’ పేర్కొన్న మిగతా ఇద్దరూ అన్ లిస్టెడ్ కంపెనీల బిలియనీర్లలో ఒకరు రామోజీ రావు ‘అయ్యుండొచ్చు’ అని సాక్షి పేర్కొంది. మీడియాతో పాటు ఫిల్మ్ సిటీ, కళాంజలి, పచ్చళ్లు, సినీ నిర్మాణం.. తదితర వ్యాపార సామ్రాజ్యాలను కలిగి ఉన్న రామోజీ ఆస్తుల విలువ భారీగానే ఉండవచ్చని సాక్షి అంచనా వేసింది. 

Show comments