కప్పల తక్కెడ రిజల్ట్ కాస్సేపట్లో

నిండా మునిగినోడికి చలేంటి.? ఇది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకి బాగా వర్తిస్తుంది. అంతా సరిగ్గానే వున్నట్లు కన్పిస్తున్నా, ఎక్కడ తన పుట్టి మునిగిపోతుందోనన్న ఆందోళన ముఖ్యమంత్రి పళనిస్వామిది. కాస్సేపట్లో తమిళనాడు అసెంబ్లీలో జరగబోయే బల పరీక్ష సందర్భంగా పన్నీర్‌ సెల్వంకి పెద్దగా నష్టమేమీ లేదు. ఇక్కడ, అసలు పరీక్ష ముఖ్యమంత్రి పళనిస్వామికే. నిన్నటికి 124 మంది ఎమ్మెల్యేల బలం పళనిస్వామికి వుంది. కానీ, పొద్దున్నకి సమీకరణాలు కాస్త మారాయి. మరీ ఎక్కువగా ఏమీ కాకపోయినా, ఒక్క ఎమ్మెల్యే తగ్గినా సీన్‌ మారిపోతుంటుంది మరి.! 

ఈ రోజు ఉదయానికొచ్చేసరికి పళనిస్వామి శిబిరం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. అందులో ఒకరు పన్నీర్‌ సెల్వంకి మద్దతిస్తే, ఇంకొకరేమో బల పరీక్షకు తాను దూరంగా వుంటానని స్పష్టం చేయడం గమనార్హం. మరోపక్క, తన వర్గం ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్‌ నుంచి నేరుగా అసెంబ్లీకి ఏకంగా 35 వాహనాల్లో తరలించారు పళనిస్వామి. 

తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష నెగ్గాలంటే, పళనిస్వామికి 117 మంది ఎమ్మెల్యేల అవసరం వుంటుంది ప్రస్తుత లెక్కల ప్రకారం. ఆ నెంబర్‌ దాటి, ఇంకాస్త ఎక్కువగానే ఎమ్మెల్యేలను కలిగి వున్నా, ఏ క్షణాన 'కప్పల తక్కెడ'లో మొగ్గు ఎటువైపు మారిపోతుందో ఆయనకీ తెలియని పరిస్థితి. అందుకే పళనిస్వామి నరాలు తెగే ఉత్కంఠను అనుభవిస్తున్నారు. 'పైకి కన్పించే బలాబలాలెలా వున్నా.. అసెంబ్లీలో అసలు బలం తేలిపోతుంది..' అంటూ నిన్న చాలా కాన్ఫిడెంట్‌గా పన్నీర్‌ సెల్వం చేసిన వ్యాఖ్యల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం. 

ప్రతిపక్షం డీఎంకే, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌, పన్నీర్‌ సెల్వం వర్గం.. ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేయనున్న విషయం విదితమే. ఈ సంఖ్య అటూ ఇటూగా 110కి చేరుకున్నట్లు తెలుస్తోంది. అంటే, ఏమాత్రం తేడా కొట్టినా, పళనిస్వామి సంగతి అంతేనన్నమాట. చూద్దాం.. ఈ కప్పల తక్కెడ వ్యవహారంలో పళనిస్వామి తనకు అనూహ్యంగా దక్కిన ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకుంటారో, చేజార్చుకుంటారో.!

Show comments