పవన్‌ లాంటి పార్ట్‌ టైమర్‌ కు సాధ్యమా?

అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తా... తొలి నియామకాలు కూడా.. సీమ నుంచే.. ఇప్పటికే అప్లికేషన్లు, రిటన్‌ ఎగ్జామ్‌.. ఇవన్నీ అయ్యాయి. దాదాపు రెండువేల అప్లికేషన్లు వచ్చాయట... చాలా చాలా తక్కువే! పవన్‌ వంటి క్రేజీ హీరో పిలిస్తే.. పార్ట తరపున పనిచేయడానికి ఐడీకార్డులు ఇస్తానని చెబితే.. ఒకజిల్లా అంతా కలిపి అన్ని తక్కువ అప్లికేషన్లా!

మరి ఆ సంగతలా ఉంటే... ఇంతకీ రాయలసీమలో జనసేన వైపు వెళ్లే నేతల ఎంతమంది ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. తెలుగుదేశం, వైకాపాలు తప్ప పోటీలో మరో పార్టీకి అవకాశం లేనిచోట.. జనసేనంత మేరకు నేతలను ఆకర్షించగలదనేది ఆసక్తికరమైన అంశం. జనాలకు ఇప్పటికీ పిసరంతైనా చేరువకాని పవన్‌కల్యాణ్‌ పార్టీ నేతలనైనా తనవైపుకు తిప్పుకోగలదా? అనేది అనుమానాస్పదంగా మారుతోంది.

చిరంజీవి మిగిల్చిన చేదు అనుభవాల అనంతరం.. సీమలో పవన్‌కల్యాణ్‌ నమ్మే జనాల మాటేమో కానీ.. కనీసం అంతో ఇంతో నేపథ్యం ఉన్న నేతలైనా కదులుతారా? అనేది అనుమానాస్పదంగా మారింది. రాయలసీమ మాటకొస్తే.. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ఉత్సాహంగా అటువైపు చేరిపోయారు.

సీమలో వలసలు ప్రధానంగా టీడీపీ నుంచే సాగాయి. భూమానాగిరెడ్డి కుటుంబం, సి.రామచంద్రయ్య, ప్రభాకర్‌ చౌదరి... తెలుగుదేశంలో గట్టిగా పనిచేసిన ఇలాంటి వాళ్లు ప్రజారాజ్యం వైపు వెళ్లారు. అయితే వీరిలో కూడా ఎవరూ అద్భుతాలు సాధించలేకపోయారు. తిరుపతి నుంచి చిరు గెలవడం, ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డికి మించి సంచలనాలను నమోదు చేసినవారు లేరు. మరి ఇప్పుడు ఎవరు?

జనసేనలోకి వెళ్లే జననేతలు ఎవరు? అంటే చెప్పడం కష్టమే అవుతోంది. టీడీపీ, వైకాపా, కాంగ్రెస్‌లలోని ఎవరైనా జనసేన వైపు వెళ్తారా? అనేది పరిశీలిస్తే.. అంత ఊపేదీ కనిపించడంలేదు. ఎంతకాదనుకున్నా.. టీడీపీ అధికారంలో ఉంది, కాబట్టి, వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని వీడి జనసేనను చేరే అమాయకులు ఎవరూ లేనట్టే. ఇక వైకాపా, కాంగ్రెస్‌!

వీటి నుంచి పవన్‌కల్యాణ్‌ ఎంతమందిని ఆకర్షించగలడు? అనేదే ప్రశ్న. వెనుకటికి.. ప్రజారాజ్యంలో చేరి కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్లు రాయలసీమలో చాలా మందే ఉన్నారు. కనీసం ఎమ్మెల్యేలం, ఎంపీలం అనిపించుకుందామని వారు చాలా కష్టపడ్డారు. అయితే మరీ వ్యక్తిగత ఇమేజ్‌ బీభత్సమైన స్థాయిలో ఉండిన శోభానాగిరెడ్డి లాంటివాళ్లు తప్ప... ఎవరూ గెలవలేకపోయారు. అలాంటి వాళ్లు ఎవ్వరూ పవన్‌ పార్టీ వైపు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదిప్పుడు.

కొత్త నేతలను తయారు చేసుకోవాల్సిందే! పవన్‌లాంటి పార్ట్‌టైమ్‌ పొలిటిషియన్‌కు అది సాధ్యం అయ్యే పనేనా? కానీ పవనేమో.. ఎన్నికలను ఎదుర్కొనడానికి రెడీ అంటున్నాడు. బహుశా చుట్టూ ఉన్న వాళ్లు పొగిడీ పొగిడీ అవన్నీ  నిజాలే అనుకుని.. జనసేనాధి నేత అలాంటి ప్రకటనలు చేస్తున్నాడేమో. ప్రత్యేకంగా రాయలసీమ మీదే దృష్టి పెట్టానని పదే పదే చెబుతున్నాడు.. కానీ తన మాటలకు క్షేత్రస్థాయిలో కదలికలేదని, మొన్నటి ఎన్నికల ముందు తనేం మాట్లాడాను, మూడేళ్ల నుంచి ఏం చేస్తున్నాను అనే విషయాన్ని జనాలు పట్టించుకోవడం లేదని పవన్‌ అనుకుంటున్నాడేమో పాపం.

Show comments