టైటిల్ కన్‌ఫామ్ అయ్యింది.. కాస్సేపట్లో పవన్‌కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'కాటమరాయుడు' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. టైటిల్ పేరుని కన్‌ఫామ్ చేస్తూ చిత్ర నిర్మాత శరద్‌మరార్ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ రోజు (సెప్టెంబర్ 1) రాత్రికి ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు శరద్ మరార్.
'గోపాల గోపాల' ఫేం డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ముందుగా ఈ చిత్రానికి 'కడప కింగ్' అనే టైటిల్‌ని పరిశీలించారు. అయితే, ఆ టైటిల్ అంత క్యాచీగా లేదని భావించి, రకరకాల టైటిల్స్ గురించి ఆలోచించారు. చివరికి 'అత్తారింటికి దారేది' సినిమాలో పాపులర్ అయిన 'కాటమరాయుడా కదిరి నరసింహుడా..' పాటలోంచి 'కాటమరాయుడు'ని తీసుకుని టైటిల్ ఫిక్స్ చేశారు.
పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన 'అత్తారింటికి దారేది'లోని 'కాటమరాయుడా కదిరి నరసింహుడా..' పాటని ఆయనే స్వయంగా పాడిన విషయం విదితమే. ఆ పాట అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. నిజానికి ఇది పాట కాదు, ఓ సీన్‌లో వచ్చే చిన్న బిట్ మాత్రమే. ఎలాగైతేనేం, ఇంతలా పాపులర్ అయిన 'కాటమరాయుడు' ఇప్పుడిలా టైటిల్‌గా మారుతుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతా బాగానే వుందిగానీ, 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ ఎక్కడిదాకా వచ్చింది.? ఆ ఒక్కటీ మాత్రం అడగొద్దు.. ఎందుకంటే ఇది పవన్‌కళ్యాణ్ సినిమా. కొత్తగా రెండు పడవల మీద ప్రయాణం షురూ చేసిన పవన్, 'కాటమరాయుడు' చిత్రాన్ని ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడో ఏమో.!