బీజేపీ కమ్మ – బీజేపీ రెడ్డి – బీజేపీ కాపు!

చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ తేడాలు. వివిధ అంశాల గురించి భారతీయ జనతా పార్టీ నేతలు మాట తీరును చూస్తుంటే, వాళ్లు బీజేపీ నేతల అనే విషయంతో పాటు, వాళ్ల విజన్ లో ‘కులాన్ని’ కూడా గుర్తించాల్సి వస్తోంది. ఏదైనా ఒక పార్టీ లో విబేధాలు మామూలే, కాంగ్రెస్ వంటి పార్టీలో అయితే బోలెడన్ని కాంట్రడిక్షన్లు. రచ్చ కు ఎక్కి కొట్టుకుంటారు కాంగీయులు. బీజేపీలో మరీ ఇలా కొట్టుకోవడం లేదు కానీ… అంత కన్నా విషపూరితమైన ‘కుల’ తేడాలు కనిపిస్తున్నాయి కమలం పార్టీలో!

ఏ అంశం మీద అయినా.. కమలం పార్టీకి ఒక స్టాండు అంటూ లేదు. రాజకీయ పరమైన అంశాల్లో అయితే.. ఈ పార్టీ నేతలు స్పందిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంటోంది. ఏదైనా అంశం గురించి.. ఈ పార్టీలోని నేతల్లో కులాల వారీగా వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కమ్మ – కాపు, కమ్మ –రెడ్డి.. ల వారీగా అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఉదాహరణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇరుక్కున్న ఓటుకు నోటు కేసు వ్యవహారంపై బీజేపీ నేతలు స్పందించాల్సి వస్తే.. దాంట్లో విరుద్ధమైన స్పందనలు ఉంటాయి. బీజేపీలోని కమ్మ సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేతలేమో.. “ఓటుకు నోటు కేసు’’ ను తేలికగా కొట్టి పడేస్తారు. అందులో పస లేదని అంటారు! అది రాజకీయం అంటారు. ఆ మధ్య కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అయితే.. ‘చంద్రబాబుపై కేసులేం లేవుగా..’’ అనేశాడు! అలా క్లీన్ చిట్ ఇచ్చేశాడు.

ఇక చంద్రబాబు విధానాల విషయంలో కావొచ్చు.. ఈ కేసుల వ్యవహారాల్లో కావొచ్చు.. బీజేపీలోని ‘రెడ్డి’ సామాజికవర్గం నేతలు బాబు విచారణలను ఎదుర్కొనాలని సన్నాయి నొక్కులు నొక్కుతారు. అలాగని వీరు బాబును పూర్తిగా వ్యతిరేకిస్తారని కాదు, పార్టీలోని కమ్మ నేతలతో పోల్చి చూస్తే.. వీళ్లకు బాబుపై ప్రేమ తక్కువ.

ఇక పార్టీబలోపేతం విషయంలో.. కమ్మ- కాపు నేతల మధ్య విబేధాలు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఆ మధ్య పవన్ కల్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడినా, కమలం పార్టీలోని కాపు నేతలు పవన్ విషయంలో సానుకూలంగా స్పందించారు. ఆ సంగతలా ఉంటే.. పార్టీ ఏపీ విభాగం అధ్యక్ష పదవి పార్టీలోని కమ్మ –కాపు సామాజికవర్గ సంగ్రామంగా మారింది.

నెలలకు నెలలు గడిచిపోతున్నా.. ఇప్పటి వరకూ ఏపీ విభాగానికి అధ్యక్షుడిని నియమించుకోలేకపోతోంది బీజేపీ జాతీయ నాయకత్వం. ఒక కాపు సామాజికవర్గానికి చెందిన నేతకు ఈ పదవి దక్కనీయకుండా.. కమ్మ లాబీ బలంగా అడ్డు పడుతోందనేది బహిరంగ రహస్యం. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా.. సదరు కాపు నేత పై అసహనంతోనే ఉన్నాడు. అతడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ విభాగం అధ్యక్ష బాధ్యతలు దక్కనీయకుండా చక్రం అడ్డేస్తున్నాడు. అసలు కులాల కొట్లాటలో.. రానున్న మూడేళ్లలో అయినా అమిత్ షా.. ఏపీ బీజేపీకి అధ్యక్షుడిని నియమించగలడా? అనేది పెద్ద సందేహంగా మారింది!

మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్న పార్టీ.. ఏదైనా బలోపేతం అవుతుంది కానీ, తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని, కాంగ్రెస్ చెట్టు కూలిపోతున్న వేళ కమలంపై వాలిన వాలిన ఒక సామాజికవర్గ నేతల పుణ్యమా అని.. కమలం క్రమంగా కుంచించుకుపోతోంది!

Show comments