ఎట్టకేలకు ఏపీలో బెల్ట్‌ షాపులు ఔట్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక వాస్తవం చెప్పారు. ఇది ఆయన ధోరణికి భిన్నమైనదే అయినా మనం అంగీకరించవలసిందే. ఏపీలో బెల్ట్‌షాపులను ఉండనివ్వబోమని, అధికారులంతా వెంటనే వాటిపై దాడి చేయాలని ఆయన ఆదేశించడం మంచిపనే. కాకపోతే ఈ పని మూడేళ్ల క్రితం జరిగి ఉండవలసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఐదు మొదటి సంతకాలు అంటూ హడావుడి చేసినవాటిలో బెల్ట్‌ షాపులు కూడా ఉన్నాయి.

వాటిని రద్దు చేస్తున్నామని, ఇక అవి ఉండ బోవని 2014లో ఫైలుపై సంతకంచేసిన చంద్రబాబు మరి ఇంతవరకు ఎందుకు వాటిని తొలగించే యత్నాలు చేయలేదన్న ప్రశ్న అంతా వేస్తున్నారు. చివరికి మిత్ర పక్షమైన బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు కూడా అడిగారు. ఆయనైతే ఏపీ మద్యం పాలసీని బూతు పాలసీగా అభివర్ణించడం విశేషం. ఈ మూడేళ్లుగా బెల్ట్‌షాపులు ఉన్నట్లు చంద్రబాబు అంగీకరించినట్లే కదా అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.

చంద్రబాబు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఏపీలో బెల్ట్‌షాపులు వర్ధిల్లిన మాట నిజం. అందులో అత్యధికం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు చెందినవే అన్నది మరింత వాస్తవం. పదేళ్లపాటు వరసగా అధికారంలో లేకపోయిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతులను చేయడానికి గాను బెల్ట్‌షాపులను రద్దుచేస్తున్నట్లు తొలిరోజే ప్రకటించినా, ఆ తర్వాత పట్టించుకోలేదని అనుకోవాలి.

మద్యాన్ని ఆదాయ వనరుగా బావించమని పైకి చెబుతూనే, వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రాలు ఆర్జిస్తున్నాయి. అందుకు ఏపీ కూడా అతీతంగా కాదు. కాని అదే సమయంలో నియమాలు, సామాజిక కట్టుబాట్లు, విలువల పతనం వంటి అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దాంతో తెలుగు రాష్ట్రాలలో తాగడం అన్నది విచ్చలవిడిగా మారింది. ఇందుకు తెలంగాణను కూడా మినహాయించలేం. హైదరాబాద్‌లో మద్యంషాపుల పక్కనే పర్మిట్‌ రూమ్‌లు అంటూ తెరిచారు.

అక్కడ తాగుబోతులు తాగే తీరు చూస్తే బాధ కలగుతుంది. మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడిన తెలుగు రాష్ట్రాలలో ఈ ధైన్య స్థితికి కారణం రెండురాష్ట్రాలు అనుసరిస్తున్న వివిధ విధానాలే. ప్రజలను మభ్య పెట్టే పథకాల కోసం వేల కోట్ల రూపాయలు అవసరం కనుక, మద్యం షాపులను, బెల్ట్‌షాపులను ఇష్టం వచ్చినట్టు ప్రోత్సహించారు. ఏపీలోనే నలభైవేల బెల్ట్‌ షాపులు ఉన్నాయని చెబుతున్నారు.

అనేక మంది టీవీలలో జరిగే చర్చల కార్యక్రమానికి మరీ ఫోన్‌ చేసి ఆ వివరాలు ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళిలో ఎక్కడ బడితే అక్కడ ఈ బెల్ట్‌షాపులు ఉన్నాయట. అది మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడుల స్వగ్రామం. తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన కేంద్రం. అలాంటి చోట్ల ఆధర్శంగా ఉండవలసిన గ్రామాలు ఇలా బెల్టుషాపుల మత్తులో తేలియాడుతున్నాయి. దీనిని బట్టి మిగిలిన గ్రామాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దంటే  ఆ రోడ్లనే డీనోటిఫై చేస్తున్నారు. దేవాదాయశాక గుడులు, ప్రైవేటు స్కూళ్ల చెంత ఇవి ఉన్నా ఫర్వాలేదా అని బీజేపీ నేత ప్రశ్నించారు. ఒక వైపు మాదక ద్రవ్యాలు సమాజంపై ఎలాంటి సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయో చూస్తున్నాం. మరో వైపు మద్యం షాపులు, వాటికి అనుబంధంగా బెల్ట్‌షాపులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏపీలో ఇటీవల మహిళలలో వచ్చిన చైతన్యానికి చంద్రబాబు ప్రభుత్వం కొంత భయపడింది.

దానికి తోడు విపక్షనేత వైఎస్‌ జగన్‌ చేసిన మూడు అంచెలలో మధ్య నిషేధం పాలసీ ప్రభావం కూడా పడి, ఇప్పుడు చంద్రబాబు కూడా మూడేళ్ల తర్వాత మేలుకున్నారను కోవాలి. ఆ క్రమంలోనే ఆయన వాస్తవం చెప్పారు. ఈ మూడేళ్లలో బెల్ట్‌షాపులను నిరోధించలేదని ఆయన ఒకటైనా నిజాన్ని అంగీకరించి నందుకు ధన్యవాదాలు చెప్పాలి.

టీడీపీ ఆఫీసులో జీవీఎంసీ అధికారులు

పసుపు పార్టీకి తర తమ భేదాలు లేవన్నది మరో మారు రుజువైంది. ఆ పార్టీ విశాఖ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ తన నియోజకవర్గంలో సమస్యలపై తాజాగా నిర్వహించిన ప్రజా దర్బార్‌కు జీవీఎంసీ అధికారులు హాజరై అందరినీ ఆశ్చర్యపరచారు. పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ అధికారులు రావడంపై విపక్షాలు మండి పడుతున్నా ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోకుండా సమీక్ష నిర్వహించేశారు.

బిడియ పడుతూనే సమావేశానికి హాజరైన అధికారులు ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎక్కడకు పిలిచినా రాక తప్పదు కదా అని సమర్ధించుకోవడం విశేషం. పార్టీలు, అధికారాలు శాశ్వతం కాదు, అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేయాల్సి ఉంటుంది, అటువంటిది ఓ పార్టీ ఆఫీసుకు నేరుగా రావడమే కాకుండా తమ్ముళ్ల అందరి మధ్యన కూర్చుని సమీక్షలు నిర్వహించడం ఏంటి విడ్డూరం కాకపోతేనని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

ఇది ఏమంత పెద్ద విషయం కాదని, ప్రజా సమస్యలపై చర్చించడానికి అధికారులను పిలిస్తే తప్పేంటని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పేర్కొనడం గమనార్హం. ఇకపై ప్రతీ టీడీపీ ఎమ్మెల్యే తన పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమీక్షలకు ఇదే తీరున అధికారులు హాజరవుతారా, అక్కడ తెలుగుదేశం పార్టీ వారే తప్ప వేరెవరూ ఉండని చోట ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారన్నది అధికారులే సమాధానం చెప్పాలి.

ఇక, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వినూత్న రాజకీయ పోకడలు మరింతగా కొనసాగిస్తూ ప్రతీ శుక్రవారం ముస్లింల కోసం ప్రజా దర్బార్‌ అంటూ ఆర్భాటంగా ప్రకటించేశారు. మరి, ఈ ఓటు బ్యాంకు సమీక్షలకు కూడా అధికారులు హాజరైతే తమకు ఉన్న తటస్థ ముద్రను చేరిపేసుకుని ఏకంగా టీడీపీ సభ్యత్వాన్నే తీసుకుంటే సరిపోతుందని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

Show comments