బొత్సకు ఇరకాటమే..!

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణకు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన భవిష్యత్తు రాజకీయాలకు చెక్‌ చెప్పేందుకు టీడీపీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుని ఉంచింది. వచ్చే ఎన్నికలలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ తన తమ్ముడు, బంధువులకు టిక్కెట్లు ఇప్పించుకోవడమే కాకుండా, తన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దింపేందుకు బొత్స వ్యూహరచన చేస్తున్నారు. ఆ విధంగా విశాఖ, విజయనగరం జిల్లాలలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడం ద్వారా 2019 ఎన్నికల తరువాత గరిష్టంగా రాజకీయ లాభాలను పొందాలని స్కెచ్‌ వేస్తున్నారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్న బొత్స పొలిటికల్‌ రూట్‌కు బ్రేక్‌ వేసేలా టీడీపీ ప్రణాళికలను సిద్ధంచేస్తోంది. ఆయనకు రాజకీయంగా బద్ధ శత్రువుగా ఉన్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును మంత్రిని చేయడం ద్వారా విజయనగరం జిల్లాలో పైచేయి సాధించేందుకు రంగం సిద్ధం చేసింది. బొత్స పొడగిట్టని వారిని చేరదీయడమే కాకుండా, సజయ కృష్ణ రంగారావుకు వైసీపీలో ఉన్న సన్నిహితులను కూడా టీడీపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

వైసీపీలో బొత్సను ఒంటరిని చేయడం ద్వారా బలమైన దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. బొత్సకు ఆయన రాజకీయ గురువు, ప్రస్తుతం వైసీపీలో ఉన్న సాంబమూర్తిరాజుతో పాటు, ఎమ్మెల్సీ  కోలగట్ల వీరభద్రస్వామి వంటి వారిలో పొసగని సంగతి విధితమే. మంత్రిగా జిల్లాలో పెత్తనం చేస్తున్న రంగారావు తన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని వీరిని వైసీపీ నుంచి బయటకు తీసుకువస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో రాజకీయ సమీకరణలను తారుమారు చేసేందుకు అక్కడ పార్లమెంట్‌కు ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి అశోక్‌ను నియమించడం ద్వారా టీడీపీ చాణక్య నీతిని ప్రదర్శించింది. అశోక్‌కు బొత్స అనుపానులు క్షుణ్ణంగా తెలియడమే కాదు, ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేయగల దిట్ట కావడం, టీడీపీకి విధేయునిగా ఉండడం వంటివి కనుక చూసుకుంటే అనకాపల్లి ఎంపీ సీటుకు బొత్స సతీమణిని పోటీ చేయించి గెలిపించుకోవడం అంత సులువు కాదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. మొత్తం మీద చూసుకుంటే బొత్స చుట్టూ రాజకీయ అష్ట దిగ్బంధనం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Show comments