ఈవారం మళ్లీ కలవరమే

నోట్ల రద్దు తరువాత టాలీవుడ్ కాస్త భారీ కుదుపునకు గురయింది. సినిమాలు చకచకా వాయిదా పడ్డాయి. అయితే గతవారం విడుదలయిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మళ్లీ కాస్త ఆశలు రేపింది. ఆ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూడగానే దిల్ రాజు తన రెమో సినిమా డేట్ అనౌన్స్ చేసారు. అప్పటికే ఫిక్సయిన జయమ్ము నిశ్చయమ్మురా వుండనే వుంది. 

ఇలా ఈవారం థియేటర్లలోకి మూడు సినిమాలు వచ్చాయి.  రెమో, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలు పబ్లిసిటీ మీద కాస్త గట్టిగానే ఖర్చుచేసాయి. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాకు సోషల్ నెట్ వర్క్ లో కూడా మంచి బజ్ వచ్చింది. కానీ చిత్రం తొలి రోజు థియేటర్ల దగ్గర కు వచ్చేసరికి సీన్ రిపీట్ అయింది. చేసిన పబ్లిసిటీ, సినిమాల లుక్ తో పోల్చుకుంటే, అటు రెమోకి కానీ, ఇటు జయమ్ము కు కానీ చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాలేదు.  వచ్చిన ఓపెనింగ్స్ తో థియేటర్ ఖర్చులు కిట్టుబాటు అవుతాయోమో కానీ, షేర్ లు మిగిలేంత కాదని ఇండస్ట్రీ టాక్.  ఇది చూసి మళ్లీ ఇండస్ట్రీ దిగాలు మంటోంది.

చిన్నవాడా..విడుదలకు ముందు మూడు వారాలుగా సరైన సినిమా పడకపోవడం, నోట్ల తలకాయనొప్పి వంటి సమస్యలతో విసుగెత్తివుండడంతో, పరిస్థితి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ జనాలు ఆచి తూచి థియేటర్ కు రావడం అన్నది బి సి సెంటర్లలో క్లియర్ గా కనిపిస్తోంది. చిత్రమేమేమిటంటే, రెమో లా కలర్ ఫుల్ గా లేకున్నా, భారీగా ఖర్చు చేయకున్నా, జయమ్ముకే కాస్త ఎడ్జ్ వుండడం. అంటే సినిమాలో స్టార్ కాస్ట్, పరిచయమైన మొహాలు వంటివి కూడా చూస్తున్నారని అనుకోవాలి. 

ఇదంతా చూస్తుంటే థియేటర్ల వద్ద పరిస్థితి పూర్తిగా సెట్ అయి, రెండు మూడు సినిమాలు వచ్చినా, ఫరవాలేదనుకునే పరిస్థితి రావడానికి ఇంకా కొన్ని వారాలు పట్టేలా వుంది.

Show comments