కోట్ల వైకాపాలో చేరిక.. ఇక లాంఛనమే!

కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. ఇప్పటికే కోట్ల వర్గీయులు కొందరు వైకాపాలో చేరిపోయారు. కర్నూలు జిల్లాలో వైకాపా నుంచి కూడా కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీలో చేరిపోవడంతో జగన్ కు కూడా ఇక్కడ నేతల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోట్ల వైకాపాలో చేరిక గురించి గత కొన్ని రోజులు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోట్ల బహిరంగంగా స్పందిస్తున్న వైఖరిని బట్టి… ఆయన వైకాపాలో చేరడం ఇక లాంఛనమే అని స్పష్టం అవుతోంది.

ప్రత్యేకహోదా విషయంలో వైకాపా అధినేత జగన్ పోరాటం తీరును కోట్ల మెచ్చుకున్నాడు. హోదా కోసం వైకాపా ఎంపీల చేత రాజీనామా చేయిస్తానన్న జగన్ నిర్ణయాన్ని కోట్ల స్వాగతించాడు. కేంద్ర ప్రభుత్వంపై ఈ విధంగా ఒత్తిడి పెంచాలన్న జగన్ వ్యూహాన్ని కోట్ల అభినందించాడు. 

ఆల్రెడీ కాంగ్రెస్ లో కోట్ల బోలెడంత అసంతృప్తితో ఉన్నాడు. ఆ మధ్య రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు తన విషయంలో వ్యవహారించిన తీరుపై కోట్ల తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాడు. అంతకన్నా ముందు నుంచే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు కోట్లపై కన్నేసి ఉండటం విశేషం. స్వయంగా నారా లోకేష్ బాబు వెళ్లి కోట్ల ను కలిసి… తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించాడు. 

పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలి… బయటి వాళ్లకు బంపర్ ఆఫర్లు ఇచ్చి అయినా చేర్చుకోవాలన్న థియరీ ప్రకారం లోకేష్ వెళ్లి కోట్లతో సమావేశం అయ్యాడు. అయితే తెలుగుదేశంలో చేరికకు కోట్ల సుముఖత వ్యక్తం చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి తనయుడు, కాంగ్రెస్ తరపున మాజీ కేంద్రమంత్రి కూడా అయిన కోట్ల.. తెలుగుదేశంలో చేరడానికి ఇష్టపడలేదు కాబోలు.  

మరి ఇప్పుడు వైకాపా కూడా ప్రాంతీయ పార్టీనే అయినప్పటికీ కొన్ని సమీకరణాలు అనుకూలంగా ఉండవచ్చు. ఎలాగూ వైకాపా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక విషయంలో జగన్ విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నాడు. ఎంపీల చేత రాజీనామా అని కూడా జగన్ అంటున్నాడు.. మరి కోట్ల జూనియర్ వైకాపాలో చేరడానికి ముహూర్తం సమీపిస్తోందేమో!

Show comments