మోడీపైకి దూసుకెళ్ళనున్న ఏకె 49.!

ప్రధాని నరేంద్రమోడీ వైపు ఎకె 49 దూసుకెళ్ళనుంది. ఆగండాగండీ.. ఇది తుపాకీ కాదు.. అంతకన్నా పవర్‌ఫుల్‌ వెపన్‌. అదేనండీ, ఏకే అంటే అరవింద్‌ కేజ్రీవాల్‌ అని అర్థం. మొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినప్పుడు 49 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నందుకుగాను, ఆయనకు అభిమానులు ముద్దుగా 'ఎకె49' అనే పేరు పెట్టుకున్నారు. అఫ్‌కోర్స్‌.. అదే పేరుతో అనేక విమర్శల్నీ ఆయన ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, అసలు విషయానికొస్తే.. నరేంద్రమోడీని టార్గెట్‌ చేసుకుని కేజ్రీవాల్‌.. కేజ్రీవాల్‌ని టార్గెట్‌గా చేసుకుని నరేంద్రమోడీ.. గత కొన్నాళ్ళుగా రాజకీయ వైరం కొనసాగిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్నా, అది పూర్తిస్థాయి రాష్ట్రం కాకపోవడం.. కేంద్రపాలిత రాష్ట్రం కావడంతో, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ని అడ్డం పెట్టుకుని నరేంద్రమోడీ సర్కార్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తో ఓ ఆట ఆడుకుంటోందన్నది జగమెరిగిన సత్యం. 

కేజ్రీవాల్‌ కార్యాలయంపై దాడులు, కార్యదర్శిని అరెస్ట్‌ చేయడం, పలు కేసులు నమోదు చేయడం.. ఇలా సీబీఐ ద్వారా నరేంద్రమోడీ సర్కార్‌, ఓ రేంజ్‌లో 'పొలిటికల్‌ గేమ్‌' ఆడుతోంది. ఎలా.? నరేంద్రమోడీపై పైచేయి సాధించడం ఎలా.? అంటూ ఆలోచించీ చించీ చివరికి 'టాక్‌ టు ఏకే డాట్‌ కామ్‌' పేరుతో ఓ వెబ్‌ ఛానల్‌ని ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చేశారు కేజ్రీవాల్‌. ఇంకేముంది, ఆలోచనని ఆచరణలో పెట్టేశారు కూడా. దాదాపుగా ఈ ఛానల్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతి త్వరలో ఈ వెబ్‌ ఛానల్‌ తన ప్రసారాల్ని షురూ చేయనుంది. 

అన్నట్టు, నరేంద్రమోడీ 'మన్‌ కీ బాత్‌' పేరుతో దేశవ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తున్న విషయం విదితమే. దానికి కౌంటర్‌గానే 'టాక్‌ టు ఎకె డాట్‌ కామ్‌' ఏర్పాటువుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు మాత్రం, ఇదిప్పటి ఆలోచన కాదనీ, ఎప్పటినుంచో అనుకుంటున్నదేనని చెబుతున్నాయి. ముందే అనుకున్నారో, ఇప్పుడే కొత్తగా ప్లాన్‌ చేశారో.. ఏదైతేనేం, నరేంద్రమోడీపైకి 'ఎకె 49' తుపాకీలా 'టాక్‌ టు ఎకె డాట్‌ కామ్‌' నుంచి తూటాల్లాంటి మాటలు దూసుకెళ్ళనున్నాయన్నమాట. Readmore!

Show comments

Related Stories :