ఆ ఇద్దరికి ఇది పోటీ పోటీ

జూన్ రెండో తేదీ టాలీవుడ్ కూడికలు, తీసివేతల ప్రకారం సూపర్ డేట్. ఎందుకంటే ఆ తరువాత మళ్లీ సినిమా సీజన్ ముగిసిపోతుంది. స్కూళ్లు తీసేస్తారు. జనాల దృష్టి పిల్లలు, స్కూళ్లు, చదువుల మీద వుంటుంది. అందుకే ఈ డేట్ ను వదులుకోకూడదు అనుకుంటున్నారంతా. ఇప్పటికే మధుర శ్రీధర్ 'ఫ్యాషన్ డిజైనర్', ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ' అందగాడు' విడుదలకు సిద్దం అయ్యాయి.

మధుర శ్రీధర్ చిత్రమైన నిర్మాత. ఇంతవరకు హిట్ అన్నది ఆయన చేతి వేళ్ల దాకా వచ్చి చేజారిపోతోంది. సినిమా విడుదలకు ముందు మాంచి బజ్ రావడం, కానీ తీరా చేసి సినిమా జారిపోవడం. ఈసారి మాత్రం కాస్త గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఎప్పుడో ఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు అనే ఒకే ఒక హిట్ సినిమా చేసి, ఆ తరువాత హిట్ సినిమాకు మొహం వాచి వున్న సీనియర్ డైరక్టర్ వంశీ, చాలా కసిగా ప్రయత్నం సాగిస్తున్నారు. లేడీస్ టైలర్ సినిమాను ఈ జనరేషన్ కు అనుగుణంగా కాస్త మార్చి ఫ్యాషన్ డిజైనర్ గా అందిస్తున్నారు. మణిశర్మ సంగీతంలో పాటలు ఇప్పటికే కొన్ని పాపులర్ అయ్యాయి. టీజర్లు, లుక్ లు బాగానే వున్నాయి. ట్రయిలర్ మాత్రం మళ్లీ లేడీస్ టైలర్ నే కళ్లు ముందుకు తెచ్చింది. ప్రమోషన్ ఏక్టివిటీ వెల్ ప్లాన్డ్ గా సాగిస్తున్నారు. 

ఇక ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ దీ చిత్రమైన వ్యవహారమే. మంచి సినిమాలు అందిస్తున్నారు. కానీ బ్లాక్ బస్టర్ లేదా సూపర్ హిట్ అన్నది చేతికి అందడం లేదు. అలా అని ఫ్లాప్ మూవీస్ కాదు. ఒక్క వీడు గోల్డ్ ఎహె తప్ప అన్నీ నిర్మాతకు లాస్ అయితే చేయలేదు. కానీ మంచి హిట్ కొట్టాలన్నది నిర్మాత అనిల్ సుంకర సంకల్పం. ఆ లోటు తీర్చేలాగే కనిపిస్తోంది అంధగాడు సినిమా. ఈ సినిమాకు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో మంచి టాక్ వినిపిస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ హిల్లేరియస్ గా వచ్చిందని తెలుస్తోంది. రాజ్ తరుణ్ తో ఎకె సంస్థ చేస్తున్న మూడో సినిమా ఇది.

ఇలా రెండు సినిమాలు ఢీకొనడానికి, కలెక్షన్లు షేర్ చేసుకోవడానికి రెడీ అవుతుంటే, అంతకు ముందు వారమే నాగా చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా, ఈ మూడు సినిమాలకు పోటీ తప్పదు. పైగా రారండోయ్ పూర్తి ఫ్యామిలీ జోనర్. అందువల్ల ఈవారం, వచ్చేవారం బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీనే వుంటుంది. షేర్ ను ఈ సినిమాలు ఎలా షేర్ చేసుకుంటాయో చూడాలి మరి.

Show comments