వావ్‌.. వర్మలో ఇది మళ్ళీ కొత్త యాంగిల్‌.!

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ పిట్ట ఎప్పుడెలా కూస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ పిట్ట కూసే కూతలపై వర్మకే అనుమానమొచ్చేస్తుంటుంది.. అబ్బే, నా ట్విట్టర్‌ పిట్టని ఎవరో హ్యాక్‌ చేసేశారంటూ మొత్తుకుంటుంటాడాయన. అందుకే, ఆయన ట్విట్టర్‌ పిట్ట నుంచి వచ్చే 'ట్వీట్లు' ఆయన మనసులోంచి వచ్చినవో కావో, తెలుసుకోవడం కష్టమే. 

పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'కాటమరాయుడు' విడుదలయ్యింది మొదలు, తనదైన స్టయిల్లో ఏకిపారేస్తూ వస్తున్న వర్మ ట్విట్టర్‌ పిట్ట, ఇప్పుడు వున్నపళంగా పవన్‌కళ్యాణ్‌ అభిమానిగా మారిపోయింది. రాజమౌళి, పవన్‌కళ్యాణ్‌ కాంబినేషన్‌లో సినిమా రావాలంటూ ఆకాంక్షించేసింది వర్మ ట్విట్టర్‌ పిట్ట. ఆ కాంబినేషన్‌ వర్కవుట్‌ అయితే రికార్డులు బద్దలైపోతాయట.! 

వావ్‌.. వర్మలో ఈ యాంగిల్‌ కూడా వుందా.? అనడక్కండి.. అదంతే. ఏమో, వర్మ ఎప్పుడెలా ట్విట్టర్‌లో బాంబులు పేల్చుతాడో ఎవరికెరుక.? ఇప్పటికి ఇలా, మళ్ళీ సాయంత్రానికి సీన్‌ మారిపోవచ్చు. నిన్నగాక మొన్నే పవన్‌కళ్యాణ్‌ని నీరో చక్రవర్తితో పోల్చాడు. పవన్‌కళ్యాణ్‌ మీద ఇంతలా విషం చిమ్మిన సినీ సెలబ్రిటీ ఇంకొకరు లేనంతగా వర్మ ట్విట్టర్‌ పిట్ట నుంచి ట్వీట్లు వచ్చేశాయి. అఫ్‌కోర్స్‌, కొన్ని రోజుల క్రితమే పవన్‌ని వర్మ ట్విట్టర్‌ పిట్ట దేవుడితో పోల్చేసిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇంతకీ, వర్మ ఆశిస్తున్నట్లుగా రాజమౌళి - పవన్‌ కాంబినేషన్‌లో సినిమా కార్యరూపం దాల్చతుందా.? అసలు ఆ ఆలోచన అటు పవన్‌కిగానీ, ఇటు వర్మకిగానీ వుందా.? ఏమో మరి, కాలమే సమాధానం చెప్పాలి.

Show comments