రజనీకాంత్‌ని 'రింగ్‌'లోకి లాగేస్తున్నారు

భారతీయ జనతా పార్టీకి అత్యంత సన్నిహితుడు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. అదెలా అంటే, ఆయన స్వయానా ప్రధాని నరేంద్రమోడీకి స్నేహితుడు మరి. 'నా స్నేహితుడి విజయాన్ని ఆకాంక్షిస్తున్నాను..' అంటూ 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోడీకి పరోక్షంగా రజనీకాంత్‌ మద్దతు పలికారు. బీజేపీలోకి రజనీకాంత్‌ని లాగేందుకు నరేంద్రమోడీ చెయ్యని ప్రయత్నం లేదు. కానీ, రజనీకాంత్‌ - నరేంద్రమోడీ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించేశారు. 

ఇక, రజనీకాంత్‌ని ఎలాగైనా కమలం గూటికి చేర్చాలనే ఆలోచనతో వున్న బీజేపీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా ఆయనకు గాలం వేసింది. బీజేపీలోకి రమ్మని కాదు, పుదుచ్చేరికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాల్సిందిగా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ, రజనీకాంత్‌కి పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా కిరణ్‌ బేడీ, రజనీకాంత్‌ని ఆహ్వానించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. 

మామూలుగా అయితే ఇదేమీ అంత పెద్ద విషయం కాదు. రజనీకాంత్‌ సింపుల్‌గా ఆమె ఆహ్వానాన్ని మన్నించొచ్చు, లేదా లైట్‌ తీసుకోవచ్చు. కానీ, ఇక్కడో పెద్ద కథ దాగి వుంది. సామాజిక కార్యకర్త అన్నా హజారేకి బహిరంగంగా మద్దతు పలికారు ఒకప్పుడు రజనీకాంత్‌. ఆ సమయంలో కిరణ్‌ బేడీతో రజనీకాంత్‌కి పరిచయాలున్నాయి. ఆ గ్రూప్‌లోనే వున్న అరవింద్‌ కేజ్రీవాల్‌తోనూ అంతే. ఓ సందర్భంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా రజనీకాంత్‌తో తన స్నేహాన్ని చాటుకున్నారనుకోండి.. అది వేరే విషయం. ఢిల్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్‌బేడీ, రజనీకాంత్‌ మద్దతును కోరితే, ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక, రజనీకాంత్‌ సైలెంటుగా వున్నారనే ప్రచారమూ అప్పట్లో జరిగిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, ఇప్పుడు.. కిరణ్‌ బేడీ, రజనీకాంత్‌ని ఆహ్వానించడం వెనుక పూర్తిస్థాయిలో రాజకీయ ఉద్దేశ్యాలున్నాయన్నది నిర్వివాదాంశం. పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా వున్నదేమో కాంగ్రెస్‌ నేత. కానీ, అక్కడ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బీజేపీకి చెందిన వ్యక్తి. అందరికీ తెల్సిన విషయమే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి అంటే జస్ట్‌ డమ్మీ అని. సో, ఇక్కడ పెత్తనమంతా కిరణ్‌ బేడీదే. అలా, తన పెత్తనాన్ని ఉపయోగించి రజనీకాంత్‌ని బీజేపీలోకి లాగేందుకు కిరణ్‌బేడీ ప్రయత్నిస్తున్నారన్నమాట. మరి, బీజేపీ విసిరిన తాజా వలలో రజనీకాంత్‌ చిక్కుతారా.? అసలు అనారోగ్యంతో విదేశాల్లో చికిత్స పొందుతున్న రజనీకాంత్‌, ఇప్పట్లో కనీసం కిరణ్‌బేడీ పిలుపుపై స్పందిస్తారా.? వేచి చూడాల్సిందే.

Show comments