నల్లారీ.. నిన్ను పట్టించుకునేవారేరీ.!

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.. అనూహ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అవును, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఆయనగారే. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రి పీఠమెక్కినా, ఎక్కువ కాలం ఆ పదవిలో వుండలేకపోయారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అంతే అనూహ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయేదాకా ముఖ్యమంత్రి పదవిలో వున్నారు. 

ఇక్కడ, నల్లారి విషయంలో అనూహ్యం.. అని ఎన్నిసార్లయినా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం దగ్గర్నుంచి, అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనడం.. అందులో సక్సెస్‌ అవడం.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విడిపోనివ్వనని చెప్పడం.. చివరికి చేతులెత్తేయడం.. ఇలా అన్నీ అనూహ్యంగానే జరిగాయి. కాంగ్రెస్‌ అధిష్టానంతో విభేదించి, ముఖ్యమంత్రి పదవికి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడమూ అనూహ్యమే. 

చిత్రమైన విషయమేంటంటే, 'జై సమైక్యాంధ్ర' పేరుతో పార్టీ పెట్టి, కనీసం డిపాజిట్లు కూడా తెప్పించుకోలేకపోయారాయన. రాజకీయ తెరపైనుంచి దాదాపుగా కనుమరుగైపోయిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అడపా దడపా మీడియాలో మాత్రం కన్పిస్తున్నారు. మళ్ళీ కొత్త పార్టీ పెడతారట.. బీజేపీలో చేరతారట.. టీడీపీ వైపు వెళ్ళబోతున్నారట.. జనసేన పార్టీలో చేరుతున్నారట.. కాంగ్రెస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారట.. ఇలా చాలా గాసిప్స్‌ వచ్చాయి ఆయన గురించి.. వస్తూనే వున్నాయి కూడా.! 

గాసిప్స్‌కి కరువేంటి.? ఎన్నయినా రావొచ్చుగాక.! ఇంతకీ, కిరణ్‌కుమార్‌రెడ్డి మదిలో ఏముంది.? అసలు ఆయన్ని ఏ పార్టీ అయినా దగ్గరకు రానిస్తుందా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు. దేనికీ సమాధానమైతే క్లియర్‌గా దొరకడంలేదు. ముఖ్యమంత్రిగా అలసిపోయారు గనుక, ప్రస్తుతం రెస్ట్‌ టీసుకుంటున్నారేమో. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. సన్నిహితుల ద్వారా మీడియాకి లీకులు పంపించడం, తద్వారా గాసిప్స్‌ని ఎంజాయ్‌ చెయ్యడం.. ఇదీ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిగారి నయా రాజకీయం.. అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

రాజకీయం ఓ వ్యసనమంటారు.. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక, కీలకమైన పదవులు చేపట్టాక ఖాళీగా కూర్చోవడం కష్టమే. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే చాలా ఎక్కువ రెస్ట్‌ తీసేసుకున్నారు.. కాబట్టి, రాజకీయాల గురించి ఆయన సీరియస్‌గానే ఆలోచన చేస్తుండొచ్చు. కానీ, నల్లారిని అక్కున చేర్చుకునే పార్టీ ఏది.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.

Show comments