హీరో గారూ.. మీ ఇంట్లో బయటపడ్డ నల్లధనం మాటేంటి?

అబ్బో… ఎవరికి వాళ్లు దేశభక్తిని నిరూపించుకోవడంలో దూసుకుపోతున్నారే! నల్లధనానికి, చీకటి ఆర్థిక వ్యవహారాలకు కేరాఫ్ అయిన సినీ స్టార్లు వరసగా మోడీ సాబ్ కు హ్యాట్సాఫ్ లు చెబుతూ పోతున్నారు. తాము ఎంత తీసుకుంటామో.. వీళ్లు చెప్పరు, తమ సినిమాల వసూళ్ల విషయంలో కూడా వాస్తవాలేమిటో ఎవరికీ తెలియవు. ఏ మాత్రం పారదర్శకంగా వ్యవహరించలేని ఈ సినీ వాలాలు ఇప్పుడు మోడీకి జై కొట్టి దేశభక్తులు అనిపించేసుకుంటున్నారు. మోడీ భక్తుల కళ్లల్లో ఆనంద భాష్పాలు తెప్పించేస్తున్నారు!

విషయం ఏమిటంటే.. నోట్ల మార్పిడి వ్యవహారాన్ని సమర్థించాడు మోహన్ లాల్. నల్లధనికుల ఆటను కట్టించడానికి మోడీ ఈ చర్య తీసుకున్నాడని.. ఇదొక గొప్ప నిర్ణయమని లాల్ అంటున్నాడు!

బాగుందిలే.. ఈ హీరోగారు ఇప్పుడు నల్లధనం అరికట్టడం, నీతి, నిజాయితీ, మోడీ.. అని మాట్లాడటం ఎంత విడ్డరమో వేరే చెప్పనక్కర్లేదు. ఐదేళ్ల కిందట వీరి ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగాయి! అప్పట్లో మోహన్ లాల్ ఇంట్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్టుగా ఐటీ శాఖ అధికారులు ప్రకటించారు!

మలయాళీ సినీ సూపర్ స్టార్లైన మోహన్ లాల్ , మమ్మూట్టీ ఇంటిపై ఒకేసారి ఐటీ రైడ్స్ జరిగాయి. ఇద్దరి ఇళ్లల్లోనూ ఆదాయవ్యయ వివరాల్లో చూపని ఆస్తులను గుర్తించారు ఐటీ అధికారులు. అలా గుర్తించిన ఆస్తులకు సంబంధించి ఈ హీరోలు ఐటీ శాఖకు వివరణ ఇచ్చుకున్నారు, పెనాల్టీలు కట్టి ఆస్తులను క్రమబద్ధం చేసుకున్నారు!

మరి.. దాన్ని ఏమనాలి?  ఐటీ శాఖ రైడ్స్ జరిగే వరకూ మోహన్ లాల్ ఆస్తుల వివరాలను దాచి పెట్టాడంటే.. దాన్ని నల్లధనం అనరా? లాల్ ఇంటిపైకి ఐటీ శాఖ అధికారులు రైడ్స్ కు వెళ్లగా.. అతడి ఇంట్లో కొన్ని రూమ్స్ లోకి వాళ్లు వెల్లలేకపోయారు.  గదులకు, బీరువాలకూ.. బయో మెట్రిక్ తాళాలు వేసి పెట్టాడట! 

ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ది గ్రేట్ మోహన్ లాల్ కూడా ఇప్పుడు నల్లధనం అరికట్టడం గురించి మాట్లాడుతున్నాడు. మోడీ భక్తులంతా జై కొట్టాలి మరి! అలాగే.. నెక్ట్స్ రాజ్యసభ నామినేషన్స్ లో మనోడికి ఎంపీ సీటూ ఇవ్వండి. ఇప్పుడు జై కొట్టాడు కదా..!

Show comments