రూపాయి అప్పు చేస్తే బాధ్యత వుంటుంది ఎవరికైనా. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మంత్రి వర్గానికి కానీ, ఏ మంత్రికి కానీ, ముఖ్యమంత్రి కి కానీ రాష్ట్రం కోసం చేసిన అప్పులకు నైతిక బాధ్యత కూడా వుండదు. ఎంతయినా అప్పు తెచ్చుకోవచ్చు. నిబంధనలు అనుకూలించాలి. ఇచ్చే నాధుడు వుండాలి. అంతే. అయిదేళ్ల తరువాత వచ్చిన ప్రభుత్వంపై ఆ భారం పడుతుంది. ఆ తరువాత, ఆ తరువాత అలా ఆ భారం వారసత్వంగా అందుకుంటారు తప్ప, ఎవరికీ ఏ సమస్య వుండదు. ఈ భరోసానే ఇప్పుడు రాజకీయ ప్రభుత్వాలుగా మారిపోయిన ప్రజా ప్రభుత్వాలకు పెద్ద భరోసాగా కనిపిస్తోంది.
సంక్షేమ పథకాల పేరిట చిత్తం వచ్చినట్లు డబ్బులు కుమ్మరించేసి, ఓట్లకు గేలం వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుల చిట్టా ఈరోజు బయటకు వచ్చింది. రేపు ఆంధ్ర అప్పుల చిట్టా బయటకు వస్తుంది. ఇప్పటికి వున్న అప్పు 1,14,813 కోట్లు. అంటే లక్షా పధ్నాలుగు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లు. ఇదికాక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 26,400 కోట్లు అదనంగా అప్పులు సేకరించనున్నారు. అంటే మొత్తం లక్షానలభై వేలకోట్ల పైమాటే.
ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయింపుల వల్ల, ఖర్చుల వల్ల వచ్చిన లోటు ఎంత? 26వేల కోట్లకు పైగానే. అంటే ఇప్పుడు అప్పుడు అప్పుతెస్తున్న మొత్తం తేకపోతే, బడ్జెట్ పరిణామం 1,49,446 కోట్ల నుంచి ఆ మేరకు తగ్గిపోతుంది. కానీ అలా తగ్గకూడదు. ఎందుకంటే ఎంత భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టామో అన్న బాజా వాయించుకోవాలి. అలాగే వివిధ వర్గాలకు తలా కాస్తా ఎలా కేటాయింపులు చేసామో చెప్పుకోవాలి. ఉదాహరణకు బ్రాహ్మణులకు వందకోట్లు, జర్నలిస్టులకు 30 కోట్లు ఇలా అన్నమాట. అందరూ ప్రభుత్వం శభాష్, బడ్జెట్ సూపర్ అనాలి.
కానీ ఇలా ఎడాదికి పాతిక వేలకోట్ల వంతున అయిదేళ్లకు అప్పులు చేసుకుంటూ పోతే, రాబోయే ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రభుత్వం మోపే అదనపు అప్పుభారం లక్షా పాతిక వేల కోట్లు. ఇలా ప్రభుత్వాలు తమ చిత్తానికి చేసుకుంటూ పోతే కొనాళ్లకు వచ్చే ఆధాయంలో అధికశాతం వడ్డీలకు, ప్రభుత్వ నిర్వహణకు సరిపోతుంది.
అక్కర్లేని జనాకర్షక పథకాలకు తిలోదకాలు ఇచ్చి, నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకుని, తలకు సరిపోయే తలపాగా అనే రీతిలో చిన్న సైజ్ బడ్జెట్ పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తే, విమర్శించనీయండి. కానీ లాంగ్ రన్ లో రాష్ట్రానికి మేలు జరుగుతుంది కదా? బిడ్డపుడితే మగ అయితే 12 వేలు, ఆడ అయితే 13 వేలు ఇవ్వడమా? ఎందుకోసం? ఇప్పుడు దీని కోసం నిరుపేదలు బిడ్డలను కని, ఆపై పెంచలేక ఆపసోపాలు పడాలా? కార్మికులను ఉత్పత్తి చేయాలా?
ఆంధ్ర లెక్కలు తేలాలి
తెలంగాణను మించిపోయింది ఆంధ్ర ఇలాంటి జనాకర్షక పథకాల్లో. ఇప్పుడు ఆ రాష్ట్ర అప్పులు ఏ మేరకు వున్నాయో, ఏ మేరకు తేననున్నారో రేపు తేలుతుంది. అయితే ఆంధ్ర నాయకులు చెప్పుకోవడానికి ఓ సాకు రెడీగా వుంది. అడ్డగోలుగా విభజించారు. ఆదాయంలేదు. ఎంతోకష్టం మీద బండి లాగుతున్నాం. అందుకే అప్పులు అని. నిజానికి కష్టాల్లో వున్నపుడే మరింత పొదుపు కావాలి. కానీ అది మాత్రం ఆంధ్రలో కనిపించడం లేదు. ఎందుకంటే ఓట్లకు నోట్లు జల్లడం అన్నది రాజకీయ పార్టీల స్వంత ఖజానా నుండి కాకుండా, ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాల రూపంలో అనే కొత్త సూత్రాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అదీ ఒకటి కదా?
అప్పులు పెరిగిన కొద్దీ ఏదో రూపంలో ప్రజలపైనే పన్నుల భారం పెరుగుతూ వస్తుంది. అది గమనించుకోకుండా, ప్రీ ఫ్రీ ఫ్రీ పథకాలు చూసి చంకలు గుద్దుకున్నంత కాలం పాలకుల వ్యవహారం ఇలాగే వుంటుంది.