మోస్ట్‌ వాంటెడ్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌

తెలంగాణలో కలకలం.. మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్‌, స్థానిక పోలీసులు పెద్ద ఆపరేషన్‌, అత్యంత గోప్యంగా చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నయీమ్‌తోపాటు మరికొందరు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. 

నయీమ్‌ అంటే ఓ పేరు కాదు, మాఫియాకి అదో బ్రాండ్‌ నేమ్‌.. అన్నట్లుగా నయీమ్‌ కార్యకలాపాలు కొనసాగాయి. ఒకరా? ఇద్దరా? నయీమ్‌ తుపాకీ తూటాలకీ ఎందరో బలైపోయారు. అలా బలైపోయినవారిలో ఐపీఎస్‌ అధికారి వ్యాస్‌ కూడా వున్నారు. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, రియల్టర్ రాధాక్రిష్ణ,  మాజీ మావోయిస్టు సాంబశివుడు, అతని సోదరుడు రాములు.. ఇలా నయీమ్‌ మారణహోమానికి హద్దూ అదుపూ లేకుండా పోయింది. 

2001లో చివరిసారిగా పోలీసులు నయీమ్‌ని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత నయీమ్‌ పూర్తిగా అజ్ఞాతంలో వుంటూనే గ్యాంగ్‌స్టర్‌గా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. నయీమ్‌ కార్యకలాపాల వెనుక 'పై స్థాయిలో' పెద్దల సహకారం వుందన్న ఆరోపణలు చాలానే వున్నాయి. గత కొన్నాళ్ళుగా తెలంగాణలో మళ్ళీ అలజడి సృష్టించేందుకు నయీమ్‌ కుట్రపన్నాడనీ, అధికార పార్టీ నేతలను మట్టుబెట్టేందుకు స్కెచ్‌ వేశాడనే ప్రచారం జరుగుతుండడంతో.. తెలంగాణ ప్రభుత్వం వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది. 

తొలుత షాద్‌నగర్‌లో గ్రేహౌండ్స్‌ అలజడితో, తీవ్రవాదుల కోసం వెతుకులాటగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ వేటగా నిర్ధారణ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క, నయీమ్‌ ఎన్‌కౌంటర్‌తో అతని అనుచరులు విరుచుకుపడే ప్రమాదం వున్నందున, తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

Show comments