మోడీ మెప్పుకోసం కేసీఆర్‌ 'ఫీట్లు'

ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ రాష్ట్రం ఘనస్వాగతం పలికేందుకు సమాయత్తమవుతోంది. మొత్తంగా నాలుగున్నర గంటల పాటు మాత్రమే ఆయన తెలంగాణలో వుంటారు. అయినాసరే, 'విశేష అతిథి' కావడంతో ప్రధాని రాక కోసం కనీ వినీ ఎరుగని రీతిలో తెలంగాణ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఆతిథ్యమేంటో నరేంద్రమోడీకి రుచి చూపించాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తపన. 

మిషన్‌ భగీరధ ప్రారంభం, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. ఇలా తక్కువ సమయమే అయినా పెద్ద షెడ్యూల్‌తోనే నరేంద్రమోడీ తెలంగాణలోకి అడుగు పెట్టనున్నారు. రేపు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో హైద్రాబాద్‌లో ల్యాండ్‌ అవడం, సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి ఆయన హైద్రాబాద్‌ నుంచి తిరుగు ప్రయాణమవడం, ఈలోగా మెదక్‌ జిల్లాలో పర్యటన.. ఇలా అంతా బిజీ బిజీ షెడ్యూల్‌ అనే చెప్పాలి. 

ఇక, ప్రధాని పాల్గొనే బహిరంగ సభ కోసం కేసీఆర్‌ సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎంత భారీగా అంటే, లక్షలాది మందిని తరలించే బాధ్యతని మంత్రి హరీష్‌రావు పర్యవేక్షించేంతలా. హైద్రాబాద్‌, మెదక్‌ సహా పొరుగు జిల్లాల నుంచి ప్రజల్ని తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలువురు మంత్రులు ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారు. వారందరికీ హరీష్‌రావు నేతృత్వం వహిస్తారు. 

చూస్తోంటే, ఇదంతా ప్రధానమంత్రిని 'కాకా పట్టడానికే' అన్న అనుమానాలు కలగక మానదెవరికైనా. అందులో కాస్తో కూస్తో నిజం లేకపోలేదు కూడా. తమ ఆతిథ్యంతో ప్రధానిని మెప్పించి, బహిరంగ సభలోనే కేసీఆర్‌, తెలంగాణకు వరాలు ప్రకటించాల్సిందిగా ప్రధానిపై ఒత్తిడి తీసుకురానున్నారట. కాస్త వెనక్కి వెళితే, అమరావతి శంకుస్థానకు ఇదే తరహాలో ఏర్పాట్లు జరిగాయి. కానీ, అప్పుడు నరేంద్రమోడీ ఏం చేశారు.? గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు తీసుకెళ్ళారంతే. అయితే, అక్కడున్నది చంద్రబాబు, ఇక్కడున్నది కేసీఆర్‌.  Readmore!

వంగి వంగి దండాలెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. కేసీఆర్‌, అందుకు భిన్నమని తెలంగాణ ప్రజానీకం భావిస్తోంది. ఏ విషయాన్ని అయినా కేసీఆర్‌ కుండబద్దలుగొట్టేస్తారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. మరీ అంతగా కుండబద్దలుగొట్టేయకపోయినా, విజ్ఞప్తులు మాత్రం చాలానే వుంటాయని తెలుస్తోంది. మరి, ప్రధాని వాటన్నిటికీ సానుకూలంగా స్పందిస్తారా.? లేదంటే అమరావతిలో వ్యవహరించినట్లే వ్యవహరిస్తారా.? అన్నది సస్పెన్స్‌గా మారింది. 

ప్రధాని హోదాలో నరేంద్రమోడీ రాక కోసం ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయడాన్ని తప్పు పట్టలేంగానీ, 'ఖర్చుదండగ వ్యవహారం..' అనేంతలా నరేంద్రమోడీ తీరు వుంటోందని అమరావతి శంకుస్థాపన వేదికే స్పష్టం చేసేసింది. సో, తెలంగాణలో నరేంద్రమోడీ పర్యటన, దానికి భిన్నంగా వుంటుందని ఎలా అనుకోగలం.?

Show comments

Related Stories :