టీడీపీ ఆశిస్తున్న 'లింక్‌' దొరికేనా.?

'మా పార్టీ సానుభూతిపరుడే.. కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో ఆయనకు సంబంధం లేదు..' ఇదీ వైఎస్సార్సీపీ నేతలు 'పొలిటికల్‌ పంచ్‌' రవికిరణ్‌ విషయంలో చేస్తున్న వాదన. ఇది పూర్తిగా కన్‌ఫ్యూజన్‌ వ్యవహారమే. టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్‌ని టార్గెట్‌గా చేసుకుని ఇంటూరి రవికిరణ్‌, ఫేస్‌బుక్‌ వేదికగా 'పొలిటికల్‌ పంచ్‌'తో చెలరేగిపోయాడన్నది నిర్వివాదాంశం. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. టీడీపీ, జగన్‌ని టార్గెట్‌ చేయడం.. వైఎస్సార్సీపీ, చంద్రబాబునో నారా లోకేష్‌నో టార్గెట్‌ చేయడం చూస్తూనే వున్నాం. 

కానీ, ఇక్కడ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇంటూరి రవికిరణ్‌, సోషల్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ముందు 'ఎ' అనే బోర్డ్‌ వున్న కార్టూన్‌ని రూపొందించడాన్ని హైలైట్‌ చేస్తోంది టీడీపీ. ఆ దిశగానే కేసు కూడా నమోదయ్యింది. మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించినందుకు కాదు, శాసనమండలి పరువు తీసినందుకంటూ పైకి టీడీపీ చెబుతున్న కహానీకీ, తెరవెనుక జరుగుతున్న వ్యవహారానికీ తేడా ఏంటో జనానికి క్లారిటీ వుంది. 

వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్‌ మధుసూధన్‌రెడ్డి ఈ రోజు తుళ్ళూరు పోలీసుల యెదుట ఈ వ్యవహారంపై విచారణకు హాజరయ్యారు. మరోపక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికిరణ్‌నీ మరోసారి విచారించనున్నారు పోలీసులు. ఇటు రవికిరణ్‌, అటు మధుసూధన్‌రెడ్డి వెర్షన్‌ ప్రస్తుతానికి ఒకేలా వుంది. వైఎస్సార్సీపీతో తనకు సంబంధం లేదని రవికిరణ్‌, తమ పార్టీతో రవికిరణ్‌కి సంబంధం లేదని మధుసూధన్‌రెడ్డి ఆల్రెడీ మీడియా ముందు క్లారిటీ ఇచ్చేశారు. పోలీసులతోనూ అదే చెబుతామంటున్నారు. 

అయితే, పోలీసులు పక్కాగా అన్ని విషయాలూ సేకరించారనీ, 'ఆర్థిక లావాదేవీల'పై ఓ క్లారిటీతోవ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైనప్పుడు, ఆ పార్టీతో సంబంధాల్లేకుండా ఎలా వుంటాయి.? ఈ ఒక్క ప్రశ్న ఇటు రవికిరణ్‌నీ, అటు వైఎస్సార్సీపీనీ ఇరకాటంలో పడేస్తాయి. టీడీపీకి కావాల్సింది కూడా అదే.! 

నిజానికి ఇదేమీ హత్యానేరం అంతటి తీవ్రమైనది కానే కాదు. కానీ, టీడీపీ ఈ కేసులో వైఎస్సార్సీపీని ఇరికించి, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కి చట్టపరంగా చిక్కులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరి. టీడీపీ ఆశయం నెరవేరుతుందా.? వేచి చూడాల్సిందే.

Show comments