బాబ్బాబూ.. ఆ లిస్ట్‌ బయటపెడుదురూ.!

'మేం చిత్తశుద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలిస్తున్నాం.. అవినీతికి తావు లేకుండా చేస్తున్నాం.. నేను రాజకీయాల్లో నిప్పులా బతికాను.. ఎవరికీ భయపడను. మా పాలనలో అవినీతి అన్న మాటే వినిపించదు..' 

- ఈ మాటలు చంద్రబాబు పదే పదే చెబుతూనే వుంటారు. తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడం ఆయనకి అలవాటు. చంద్రబాబుపైనా, ఆయన పరివారంపైనా, మరీ ముఖ్యంగా చంద్రబాబు తనయుడు లోకేష్‌పైనా అవినీతి ఆరోపణలు వస్తున్నా, అవన్నీ ప్రతిపక్షం చేసే అర్థం పర్థం లేని ఆరోపణలేనని అధికార పార్టీ కొట్టి పారేయడం మామూలే. 

అయితే, ఈ మధ్యనే టీడీపీ నేతలకు అమరావతిలో నిర్వహించిన శిక్షణా సమావేశాల్లో, 'సీల్డ్‌ కవర్‌'లో ఆయా నేతల జాతకాల్ని ఆయా నేతలకే అందజేశారు చంద్రబాబు. అందులో ఏముంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, 'మేటర్‌ ఇదే..' అంటూ సాక్షాత్తూ, టీడీపీ గెజిట్‌లోనే వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఫలానా జిల్లాలో పలానా మంత్రిగారు అవినీతికి పాల్పడుతున్నారనీ, ఫలానా జిల్లాలో ఫలానా ఎమ్మెల్యేగారి సోదరుడు ఇసుకాసురుడిలా తయారయ్యారనీ, ఇంకో నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్యే, సాక్షాత్తూ మంత్రిపైనే పెత్తనం చేస్తున్నారనీ.. ఇలా చంద్రబాబు మనసులో మాటల్ని సదరు గెజిట్‌ బయటపెట్టింది. 

నారా లోకేష్‌, తన ప్రచారం కోసం పెట్టుకున్న ఓ ఫొటో వివాదాస్పదమైతే, ఆయన్ను వెనకేసుకురావడానికి టీడీపీ నేతలంతా మీడియా ముందుకొచ్చారు. మరి, ఇప్పుడు ఈ టీడీపీ నేతల బాగోతం మాటేమిటి.? పైగా, టీడీపీ నేతల బాగోతంపై పార్టీ అధికార గెజిట్‌లోనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్‌. ఒకటీ, గెజిట్‌లోని వార్తల్ని టీడీపీ ఖండించాలి.. లేదా, చంద్రబాబు సీల్డ్‌ కవర్‌లో ఇచ్చిన వివరాలైనా బహిర్గతం చెయ్యాలి. 'నిప్పు' అంటే అంతే మరి. కాదు, అని దులుపుకుపోతే ఏం చేయగలం.?

కొసమెరుపు: టీడీపీ గెజిట్ వెల్లడించిన విషయాలు కొత్తవేమీ కావు.. గడచిన రెండున్నరేళ్ళుగా ప్రతిపక్షం వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలే అవి. 

Show comments