జాతీయ అవార్డులు.. ఈ ఏడాది కూడా వివాదమే..!

గత ఏడాది జాతీయ అవార్డుల ప్రకటన పై అనేక విమర్శలు వచ్చాయి. ప్రత్యేకించి ‘బాహుబలి’ సినిమాను జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించడం పలు విమర్శలకు తావిచ్చింది. అసలు పూర్తి నిడివి లేని సినిమాకు అవార్డు ఎలా ప్రకటిస్తారు? అనేది మొదటి ప్రశ్న. ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఇచ్చే ఉత్తమ చిత్రం అవార్డు పరిశీలనకు కూడా బాహుబలి సినిమా అర్హత పొందదు. ఎందుకంటే.. ఆ సినిమాకు క్లైమాక్స్ లేదు. క్లైమాక్స్ కోసం సీక్వెల్ పార్టు కోసం వేచి చూడాలని దాని రూపకర్తలు ప్రకటించారు. కాబట్టి.. బాహుబలి సినిమా అవార్డుల పరిశీలనకు కూడా పనికిరాదు. అయినా.. దాన్ని ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఉత్తమ చిత్రంగా ప్రకటించారు.

మరి అవార్డుల కమిటీకి ఆ సినిమా ఏం అర్థమైందో ఏమో! ఆ సంగతలా ఉంటే.. ఈ ఏడాది కూడా జాతీయ అవార్డుల ప్రకటనపై విమర్శలు తప్పడం లేదు. ప్రత్యేకించి అక్షయ్ కుమార్ ను జాతీయ ఉత్తమ నటుడిగా ప్రకటించడంపై దుమారం రేగుతోంది.

మామూలుగా అయితే ఈ దుమారం రేగేది కాదు.. అవార్డుల కమిటీ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తిని చూసే చాలామంది ఈ వ్యవహారంపై కామెంట్లు మొదలుపెట్టేశారు. మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్ ఈ ఏడాది అవార్డుల కమిటీ అధ్యక్ష స్థానంలో ఉండటమే.. ఈ వివాదానికి కారణం. ప్రియన్, అక్షయ్ కుమార్ కు మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు.

వీళ్లిద్దరి కాంబోలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. తను ఏ సినిమా తీసినా.. అందులో అక్షయ్ కుమార్ ను ఉండేలా చూసుకుంటాడు ప్రియన్. బాలీవుడ్ లో అత్యంత సన్నిహితులుగా పేరు పొందారు ప్రియన్, అక్షయ్ కుమార్ లు. అలాంటి ప్రియన్ అవార్డుల కమిటీ కి అధ్యక్ష స్థానంలో ఉన్న ఏడాది అక్షయ్ కుమార్ కు జాతీయ అవార్డు రావడంతో.. కొన్ని రకాల కామెంట్ల కు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రియన్ ది ఆశ్రిత పక్షపాతం.. దాని వల్లనే అక్షయ్ కు అవార్డు వచ్చింది.. అని అంటున్నారు. ఇలాంటి వారికి మరో పాయింట్ కూడా దొరికింది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ నటనను కాదని, అక్షయ్ కుమార్ కు జాతీయ అవార్డు ఇవ్వడం ఏమిటి? అనేది వీరి వాదన.

ఆ సినిమా కోసం అమీర్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. అలాగే.. ప్రేక్షకులు కూడా ఆ సినిమాను మెచ్చారు. వందల కోట్ల రూపాయల వసూళ్లకు అవకాశం ఇచ్చారు. ఇక అక్షయ్ కుమార్ కు రుస్తుం లో నటనకు గానూ అవార్డు ఇచ్చారు కదా.. ఆ సినిమా ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదు. కమర్షియల్ గా కూడా ఆ సినిమా ప్లాఫ్. ఏ రకంగానూ ఆకట్టుకోలేని సినిమాలో నటుడికి జాతీయ అవార్డును ఇవ్వడం ఏమటి?

అమీర్ కు కాదనడం ఏమిటీ, అక్షయ్ కు ఇవ్వడం ఏమిటి.. ఇదంతా ప్రియదర్శన్ పక్షపాత ధోరణే అని తేల్చేస్తున్నారు విమర్శకులు. ఈ వివాదం పై ప్రియన్ ఇప్పటికే వివరణ ఇచ్చుకున్నాడు. విమర్శలతో అక్షయ్ కూడా ఇబ్బంది పడుతున్నట్టుగానే ఉన్నాడు.. తను అవార్డును కొనుక్కోలేదు.. అని ఆ హీరో స్టేట్ మెంట్ ఇవ్వడమే ఆయన ఇబ్బందికి రుజువు.

అలాగే తమిళ దర్శకుడు మురుగదాస్ స్పందిస్తూ.. జ్యూరీపై విరుచుకుపడ్డాడు. ఎక్కడ అసంతృప్తి కలిగిందో చెప్పలేదు కానీ.. జ్యూరీ పూర్తిగా పక్షపాతంతో వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించాడు. ప్రియదర్శన్ సన్నిహిత హీరో, స్నేహితుడు మోహన్ లాల్ కు ఈ ఏడాదే అవార్డు రావడం కూడా పలు విమర్శలకు కారణం అవుతోంది. ప్రియన్ తన సన్నిహితులందరికీ అవార్డులు ఇచ్చుకున్నాడనే మాట వినిపిస్తోంది.

Show comments