ఆత్మగౌరవం ఇదేనా చంద్రబాబు.?

'అమరావతి.. ఆత్మగౌరవం.. స్వరాష్ట్రం నుంచి పరిపాలన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ సమస్య.. అందుకే పదేళ్ళపాటు హైద్రాబాద్‌ మీద హక్కులున్నా, ఆ బంధం తెంచేసుకోవాలనుకుంటున్నాం.. ప్రపంచ స్థాయి రాజధానిని వీలైనంత త్వరగా నిర్మిస్తాం.. దేశం గర్వించదగ్గ రాజధానిని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అందిస్తాం..' 

- ఇదీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మాట. పాడిందే పాటరా.. డాష్‌ డాష్‌ డాష్‌.. అన్నట్లు, చంద్రబాబు ఈ మాట చాలా చాలాసార్లు చెప్పేశారు, చెబుతూనే వున్నారు. కాలగర్భంలో దాదాపు ఏడాది కాలం గడిచిపోయింది. రేపట్నుంచి, పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నుంచే పరిపాలన సాగనుంది. అంతే, ఇదే ఆత్మగౌరవం.. అంటోంది అధికార తెలుగుదేశం పార్టీ. 

హైద్రాబాద్‌ నుంచి దాదాపుగా ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ అమరావతికి తరలించేయడంతో, తన పని అయిపోయిందన్నట్లుగా చంద్రబాబు అండ్‌ టీమ్‌ వ్యవహరిస్తోంది. నిజానికి గత విజయదశమికి అమరావతి శంకుస్థాన జరిగింది. అప్పటినుంచి ఇప్పటిదాకా, అమరావతిలో నిర్మించిన అధికారిక భవనం తాత్కాలిక సచివాలయం మాత్రమే. ఇప్పటికీ 'తాత్కాలిక సచివాలయం' అనే అంటున్నారు గనుక, దీన్ని రాజధానికి సంబంధించిన అధికారిక భవనం.. అనడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుతానికి అమరావతిలో ఇదొక్కటే దిక్కు.! అందునా, ఆంధ్రప్రదేశ్‌కి దిక్సూచి కూడా. 

బాలారిష్టాల నడుమ, ఎలాగైతేనేం తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వం పాలన షురూ చేస్తోంది. పలుమార్లు ప్రారంభోత్సవాలు జరిగాయి.. బోల్డన్ని పబ్లిసిటీ ఈవెంట్లూ చేశారు. చివరికి రేపట్నుంచి, తాత్కాలిక సచివాలయం అధికారికంగా విధుల్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తుందన్నమాట. విజయదశమినాడు చంద్రబాబు ఇక్కడి నుంచి పాలన మొదలు పెడతారట. ఆయనకి ఇంకా, ఇప్పటిదాకా చేసిన ఈవెంట్లు సరిపోయినట్లు లేవు మరి.! 

ఏడాది కాలం అంటే తక్కువేమీ కాదు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికే ఇంత సమయం తీసుకుంటే, భవిష్యత్తులో కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి పెద్ద సంఖ్యలో భవనాల్ని నిర్మించాల్సి వస్తుంది గనుక, అప్పటి పరిస్థితులు ఎలా వుంటాయి.? ఆ ఒక్కటీ అడక్కండి.. ఎందుకంటే, అలా ఎవరు ప్రశ్నించినాసరే.. వాళ్ళంతా రాజధాని వ్యతిరేకులే అవుతారు చంద్రబాబు దృష్టిలో. ఆయన చెప్పిందే ఆత్మగౌరవం, చేసిందే శాసనం. అదంతే.!

Show comments