తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నవేమీ కావు. అయితే, తాజాగా ఓ సందర్భంలో 'కొత్త రాజకీయ పార్టీపై వస్తున్న ఊహాగానాల్ని పూర్తిగా కొట్టి పారేయలేం..' అని ఆయన క్లారిటీ ఇవ్వడంతో, దాదాపు ముహూర్తం కూడా ఖరారయిపోయి వుంటుందంటూ సరికొత్త ఊహాగానాలు షురూ అయ్యాయి. వచ్చే వారంలో నిరుద్యోగుల సమస్యల కోసం హైద్రాబాద్‌లో కోదండరామ్ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్న విషయం విదితమే.
'ఇది తెలంగాణపై దండయాత్ర.. తెలంగాణ ప్రభుత్వంపై దండయాత్ర..' అంటూ కోదండరామ్ పై అధికార పక్షం దుమ్మెత్తిపోస్తోంటే, 'ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలన్నదే మా డిమాండ్.. మూడేళ్ళు ఎదురు చూశాం.. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.. ఇది ఎవరి మీదా దండయాత్ర కాదు.. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ జేఏసీ పోరు బాట పట్టింది..' అన్నది కోదండరామ్ వైపు నుంచి వస్తున్న కౌంటర్.
ఎవరి వాదనలు ఎలా వున్నా, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఈ వ్యవహారంలో అత్యంత 'సీరియస్'గా, 'వ్యూహాత్మకంగా' వ్యవహరిస్తున్నారన్నది నిర్వివాదాంశం. నిరుద్యోగుల తిరుగుబాటు తర్వాత, మారే రాజకీయ పరిణామాల్ని బట్టి, తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కోదండరామ్ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
అయితే, ఇంతవరకూ కోదండరామ్ ఏ పార్టీ వైపూ లేకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఆయనకు మద్దతిస్తూ వచ్చాయి. ఒక్కసారి ఆయన రాజకీయ పార్టీని ప్రకటించాక, పరిస్థితులు పూర్తిగా మారిపోవడం ఖాయం. రాజకీయ పార్టీగా తెలంగాణ జేఏసీని కోదండరామ్ మార్చదలచుకుంటే, ఇప్పుడున్న గౌరవం కూడా ఆయనకు భవిష్యత్తులో దక్కదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. చూద్దాం.. కొత్త పార్టీతో కోదండరామ్, తెలంగాణ రాజకీయాల్ని ఎలాంటి మలుపులు తిప్పుతారో.! తెలంగాణ రాజకీయ తెరపై కోదండరామ్ ప్రభావం చూపించగలుగుతారో.!