ఒక జర్నలిస్టు ప్రస్థానం : 'ప్రతి బుధవారం' బతుకు!

తెలుగులో 'చిన్న పత్రికలు' అనే వాటికి ఇవాళ అస్తిత్వం లేకుండా పోయింది. ఇప్పటికీ లెక్కకు మిక్కిలిగా ఉన్నప్పటికీ.. వాటిలో చాలా వరకు నామమాత్రంగా నడుస్తున్నవి. మరొక పని చేతకాక చిన్నపత్రికలు నడుపుకుంటున్న జర్నలిస్టులు కొందరు. చిన్న పత్రికలను అడ్డు పెట్టుకుని కొన్ని వక్ర ప్రయోజనాలను ఆశించి కొందరు నడుపుతూ ఉండడం నిత్యకృత్యంగా మారింది. కానీ కొన్ని దశాబ్దాలకు ముందు చిన్న పత్రికల పాత్ర సమాజంలో గణనీయంగా ఉండేది. స్థానిక సమస్యల పరిష్కారంలో చిన్నపత్రికలు చెప్పుకోదగిన పాత్ర పోషించేవి. ఒక ఊరుకు, జిల్లాకు, ప్రాంతానికి, పరిమితం అయి నడిచే చిన్న పత్రికలు తమ పరిధిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేసేవి. దాని వల్ల ఫలితం కూడా ఉండేది. శ్రీకాళహస్తిలో అలాంటి ఒక చిన్న పత్రిక 'ఆదర్శిని' వ్యవస్థాపకుడు.. ఆరంబాకం ఎల్లయ్య. తన జీవిత పర్యంతమూ, తుదిశ్వాస వరకూ, అక్షరాలా పత్రికా నిర్వహణలోనే గడిపిన వ్యక్తి ఎల్లయ్య. 

1970లో ప్రారంభం అయిన పత్రిక 'ఆదర్శిని'! అంతకు ముందే ఆయన సువర్ణముఖి, రఘుబాల వంటి పత్రికలు కొన్ని ప్రారంభించారు. అయితే ఆదర్శిని వారపత్రికగా ప్రారంభమై, చివరిశ్వాస వరకు ఆయనతోపాటు ఉంది. జర్నలిస్టుగా మహాద్భుతమైన జ్ఞానసంపదతో విశ్లేషణలు, వ్యాసాలు రాయడం, తద్వారా దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం, యావత్తు జనవాహినిలో ఒక ఆలోచన సృష్టించడం ఇలాంటివి ఎల్లయ్య చేసి ఉండకపోవచ్చు. కానీ అదే 'జర్నలిస్టు'కు ఉండే నిర్వచనంలో.. తన పరిధిలోని, తన దృష్టికి వచ్చిన ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసే మాధ్యమంగా తన పత్రికను వాడడం, ఆ పత్రికను క్రమంతప్పకుండా ప్రచురించడం అనే భాగాన్ని మాత్రం ఆయన చాలా తపనతో నిర్వర్తించారు. నిబద్ధతతో, నిజాయితీతో నిర్వర్తించారు. 

జర్నలిజం పట్ల ఆరంబాకం ఎల్లయ్య ఆసక్తి హైస్కూలు దశలోనే మొదలైంది. శ్రీకాళహస్తి సమీపం కోవనూరు ఆయన సొంత ఊరు. అప్పట్లోనే పిల్లల కోసం ఒక పత్రిక నడుపుతూ, తెల్లకాగితపు అరఠావుల మీద కార్బన్‌ కాపీలు తానే స్వయంగా రాసి పత్రికను తయారుచేసేవారు. బడికి సెలవు వచ్చిన రోజున సైకిలు మీద చుట్టు పక్కల పల్లెల్లో హైస్కూళ్లు ఉన్న గ్రామాలకు వెళ్లి అక్కడ 'లైబ్రరీ కాపీ' లాగా ఆ పత్రికను విద్యార్థి బృందాలకు పంచిపెట్టేవారు. అలా పత్రిక నిర్వహించడం మీద ఆసక్తి పెంచుకున్న ఎల్లయ్య, కాలక్రమంలో ఎస్సెస్సెల్సీ చదువు పూర్తయ్యాక, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అనివార్యంగా చిన్న ప్రభుత్వోద్యోగంలో కుదురుకున్నారు. అయినా సరే ఆయన జర్నలిజం ప్రవృత్తి అక్కడ నిలవనీయలేదు. దానికి రాజీనామా చేసి, మదరాసులో ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో తెలుగు ప్రూఫ్‌ రీడరుగా చేరి, కూలి కింద ఓ పత్రికను అచ్చు వేయించుకుంటూ తన పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. 

ఆదర్శిని ప్రారంభించిన తర్వాత తాను నమ్మిన జర్నలిజంను ఆచరణలో పెడుతూ తనకు చేతనైనంతగా సమాజం కోసం పత్రిక అనే మాటకు కట్టుబడి ఉన్నారు. కానీ జర్నలిజంలో వచ్చిన విప్లవం మొత్తం రాష్ట్రంలో చిన్న పత్రికలను దెబ్బతీసింది. ఈనాడు జిల్లా పత్రికలను టేబ్లాయిడ్‌లుగా ప్రారంభించిన తర్వాత.. చిన్న చిన్న వీధి సమస్యలు కూడా పెద్ద పత్రికలో రావడం మొదలైంది. ప్రభుత్వం ఎటూ స్పందిస్తుంది. దాంతో చిన్న పత్రికలు ప్రచురించే చిన్న సమస్యలకు విలువ పడిపోయింది. పత్రికలో ఉండే సంగతులు మారిపోయాయి... సాధారణాసక్తి ఉండే విషయాలు మాత్రమే ప్రచురిస్తూ, తన పరిచయ, సన్నిహిత వర్గంలోని వారికి మాత్రమే పోస్టు ద్వారా పంపుకుంటూ పత్రికను ఒక ఉపాధిమార్గంగా నిర్వహించడం లాగా మారిపోయింది.  Readmore!

ఆరంబాకం ఎల్లయ్య పరిస్థితి వేరు. చిన్న పత్రికల వ్యవస్థనే దెబ్బతీసిన కొత్త పరిణామాలకు ఆయన అతీతం కాదు. కానీ తను మనసా వాచా కర్మేణా 'ఆదర్శిని' వారపత్రికనే జీవితంగా మలచుకుని బతుకుతున్నాడు. అందుకే పత్రిక నిర్వహణను మాత్రం వదలిపెట్టలేదు. ఆరోజుల్లో, 1980ల ప్రాంతాల్లో, చిన్న పత్రికల నిర్వహణ చాలా కష్టంగా ఉండేది. కోర్టు నోటీసులు తప్ప మరో ఆదాయ వనరు ఉండేది కాదు. వాటి రూపేణా వారానికి రెండు మూడు వందల రాబడి సగటున ఉండేది. సొంతంగా ప్రింటింగు ప్రెస్‌ ఉంటే.. ఆ డబ్బు.. పత్రిక ప్రింట్‌ చేసే కూలీకి, న్యూస్‌ప్రింటు పేపరు ఖర్చులకు సరిపోయేది. కొన్ని వారాల్లో రాబడి ఎక్కువైపోయి, రెండు మూడు వందలు అదనంగా కూడా వస్తుండేవి. అదే భార్య, ఒక కొడుకుతో కలిసి బతికే ఎల్లయ్య కుటుంబానికి పోషణ! 

మూడువందలతో పత్రిక నిర్వహించడం బొటాబొటీగా కూడా చాలని డబ్బు. కూలీకే రెండు వందలు పోగా, ఓ వంద రూపాయలకు న్యూస్‌ ప్రింటు కొనాలి. అది కూడా మదరాసు ధర. జర్నలిస్టుగా ఎక్రిడేషన్‌ బస్‌ పాసులు ఉంటాయి గనుక.. మదరాసు ప్రయాణం సరిహద్దుల వరకు ఉచితం. ఎల్లయ్య తనే స్వయంగా రెండు వారాలకు ఒకసారి రెండు వందల రూపాయలు తీసుకుని మదరాసు వెళ్లి, రెండు రీముల క్రౌన్‌ పేపరు కొనుక్కొని ఇంటికి వచ్చేవాడు. మదరాసు బస్టాండు నుంచి పేపరు దుకాణానికి కాలినడకనే వెళ్లేవాడు.. ఎండలు మలమల మాడ్చేస్తున్నా సరే. గాంధేయవాదిగా నిత్యం ఖద్దరు లాల్చీ, పైజమాలే ధరించే ఎల్లయ్యను మదరాసీ ఎండలు తడవకు కడవడు చెమటలు కక్కించేవి. అయినా సరే.. ఆయన కనీసం రిక్షా ఎక్కేవాడు కాదు. రెండు రీముల పేపరుకు మించి కొనడానికి డబ్బు సమకూరేది కాదు. ఆ పేపరను భుజం మీదే పెట్టుకుని కిలోమీటర్లు నడిచి బస్టాండుకు వచ్చేవాడు. రిక్షా రెండు రూపాయలు దుబారా ఖర్చు కాకుండా జాగ్రత్త పడుతూ.. ఒక టీ తప్ప మరేమీ ఎంగిలిపడకుండా ఇల్లు చేరుకుని పత్రిక ఎడిటర్‌ పాత్రలోకి వచ్చి, వ్యాసాలు రాసుకునే వాడు. వారం పొడవునా పత్రికకు, మ్యాటర్‌ రాసుకోవడం, కంపోజిటర్‌తో పనిచేయించుకోవడం, ప్రింట్‌ చేయించడం.. ప్రచురించిన కోర్టు నోటీసుల డబ్బు వస్తే ఖర్చు పెట్టుకోవడం.. ఇదే పని! 

'ఆదర్శిని' వార పత్రిక. ఇవాళ్టి జిల్లా అనుబంధాల సైజులో కేవలం నాలుగే పేజీలు ఉండే చిన్న వారపత్రిక. ప్రతి బుధవారం వెలువడాలి అనేది నియమం. ఎన్ని కష్టాలు ఉంటున్నా.. పత్రికను మాత్రం 'ప్రతి బుధవారం' పత్రిక తేవాలనేది ఎల్లయ్యకు ఉండే ఒకే లక్ష్యం. పనివాళ్లతో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి రకరకాల పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఒకటిరెండు రోజులు ఆలస్యం అయ్యేది. ఆ సమయాల్లో ఆయన చాలా దిగాలు పడిపోయేవాడు. తహతహలాడి పోయేవాడు. తన వల్ల ఏదో తప్పు జరిగినట్లు బాధపడేవాడు. మళ్లీ బుధవారం పత్రిక పోస్టు అయితే అదొక తృప్తి. అందుకే ఆయనది 'ప్రతి బుధవారం' బతుకుగా సాగుతూ వచ్చింది.. అదే ఆయన శ్వాసగా నిలబెడుతూ వచ్చింది. 
ఆ రోజుల్లో జర్నలిస్టులకు సామాజికంగా కొంత గౌరవం ఉండేది. పరిచయాలు కూడా తదనుగుణంగానే ఉండేవి. అయితే అవి తన విచ్చలవిడి స్వార్థానికి కాకుండా, సామాజికంగానే ఉపయోగపడాలనే తన సొంత విలువలకు కట్టుబడి ప్రస్థానం సాగించిన వ్యక్తి ఆయన. రాష్ట్ర తెలుగు చిన్నపత్రికల సంఘాలకు కూడా ఒకటిరెండు సందర్భాల్లో నేతృత్వం వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల స్థాయిలో పెద్దలను అనేకమార్లు కలిశారు. అయితే జర్నలిజం గమనంలో ఎన్ని విప్లవాత్మక మార్పులు వచ్చినా, సమాజం కోసం చిన్న పత్రికలు కూడా సజీవంగా ఉండడం అనేది చాలా ముఖ్యం అని నమ్మిన వ్యక్తి ఆయన. స్వయం చాలితంగా వాటి మనుగడ ప్రశ్నార్థకం అయిపోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వాలు కొంత మేర ప్రకటనల ద్వారా ఆదుకోవాలని చాలా కాలం పోరాడారు. నిజాయితీగా ఉండడం, చేస్తున్న పనిని నిబద్ధతతో నిర్వహించడం అనేవి ఆయన ఎంచుకున్న జీవన విలువలు. వాటినుంచి ఆయన తుదిశ్వాస వరకు పక్కకు మళ్లలేదు. పత్రికకు మ్యాటర్‌ రాయడం పూర్తిచేసి, గుండెపోటుతో మరణించడం... అందరికీ దక్కే అదృష్టం కాదు. అలాంటి ధన్యజీవి ఆరంబాకం ఎల్లయ్య జయంతి ఇవాళ, ఆగస్టు 8. 

జర్నలిజం విలువలు మాత్రమే కాదు, ఆ జీవన విలువలు మనకు కూడా పాఠాలు..! పసితనం నుంచి ఆచరణలో వాటిని చూస్తూ నేర్చుకోవడం నాకు దక్కిన వరం. ఆ బాటను అంటిపెట్టుకుని జీవించగలగడం.. నేను లక్ష్యించగల గరిష్టమైన సంగతి. మా నాన్న ఆరంబాకం ఎల్లయ్య జయంతి సందర్భంగా నివాళి. 

- కె.ఎ. మునిసురేష్‌ పిళ్లె
kamspillai@gmail.com

Show comments

Related Stories :