నడిరోడ్డుపై కాల్చినా: తప్పు కదా జగన్‌.?

రాజకీయాల్లో కాస్తంత సహనం అవసరం ఎవరికైనాసరే. దురదృష్టవశాత్తూ రాజకీయాల్లో ఆ 'సహనం' కనుమరుగైపోయింది. సహనంతో కూడిన రాజకీయాలు చేసేవారిని వెర్రి వెంగళప్పల్లా చూస్తున్న నయా రాజకీయం ఇప్పుడు రాజ్యమేలుతోంది. అందుకే, నేతలు సంయమనం కోల్పోతున్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని 'నడిరోడ్డుపై కాల్చినా తప్పు లేదనిపిస్తుంది..' అన్న మాట ప్రతిపక్ష నేత వాడొచ్చా.? నూటికి నూరుపాళ్ళూ తప్పే ఇది.! 

అయితే, ఇక్కడ జగన్‌ వ్యాఖ్యల నేపథ్యాన్నీ అర్థం చేసుకోవాల్సి వుంటుంది. 'పరిటాల రవిని చంపిన హంతకుడు వైఎస్‌ జగన్‌..' అంటూ, గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ, అందునా చంద్రబాబు దుమ్మెత్తిపోసిన సందర్భాలు కోకొల్లలు. జగన్‌ని 'దొంగా.. దొంగా..' అంటూ తక్కువలో తక్కువ లక్ష సార్లయినా చంద్రబాబు సంబోదించి వుంటారు. పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం వుంటే, జగన్‌ని దోషిగా తేల్చి ఆ కేసులో చంద్రబాబు అండ్‌ టీమ్‌ జైలుకి పంపించొచ్చు. లక్ష కోట్ల అవినీతికి సంబంధించి కోర్టుల్లో ఇంకా జగన్‌ మీద కేసులు అలా అలా నడుస్తున్నాయంతే. దేంట్లోనూ జగన్‌ని ఇప్పటిదాకా దోషిగా తేల్చలేకపోయారు. జగన్‌ని నిందితుడంటే కిక్‌ రాదు కదా.. అందుకే, దొంగా.. దొంగా.. అంటూ పదే పదే చంద్రబాబు అండ్‌ టీమ్‌ విరుచుకుపడ్తోంది. 

రాజకీయ ఆరోపణలకు సంబంధించి ఒకర్ని తక్కువగా చూడలేం, ఇంకొకర్ని ఎక్కువగా చూడలేం. అసహన రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి కాబట్టి, అందరూ చేసేది ఆ అసహన రాజకీయమే. అసహన రాజకీయం అనే బురదలో కూరుకపోయిన రాజకీయ నాయకులే ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు.. ఇదే అతి పెద్ద కామెడీ మరి. జగన్‌కి సంస్కారం లేదన్నది టీడీపీ విమర్శ. మరి, టీడీపీకి ఆ సంస్కారం వుందా.? సూపర్‌ సీనియర్‌ అయిన చంద్రబాబే సహనం కోల్పోతున్నప్పుడు అది తప్పు కాకపోతే, వైఎస్‌ జగన్‌ సంయమనం కోల్పోతే అది తప్పెలా అవుతుంది.!

Readmore!
Show comments