అమ్మ ఆత్మ.. చిన్నమ్మకేం చెప్పిందో.!

శవ రాజకీయాల పర్వం దాటి, ఇప్పుడు సమాధి రాజకీయాల దగ్గరకొచ్చింది. తమిళనాడులో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం.. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న శశికళ 'జయలలిత సమాధి' వేదికగా రాజకీయాల్ని వేడెక్కించేస్తున్నారు. పన్నీర్‌ సెల్వం అమ్మ సమాధి వద్ద మౌనంగా గంట పాటు కూర్చుని, ఆ తర్వాత పొలిటికల్‌ బాంబ్‌ పేల్చిన విషయం విదితమే. తాజాగా, అమ్మ సమాధి వద్దకు వెళ్ళి, పూలను అమ్మకి అర్పించి.. గవర్నర్‌ని కలిసేందుకు వెళ్ళారు చిన్నమ్మ శశికళ. కామెడీ ఏంటంటే, తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు పెట్టిన సంతకాలతో కూడిన పేపర్‌ని, అమ్మ సమాధి వద్ద శశికళ వుంచడం. 

మధ్యాహ్నం నాలుగున్నర గంటల సమయంలో గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో పన్నీర్‌ సెల్వం భేటీ అయితే, ఏడున్నర గంటలకు గవర్నర్‌తో భేటీ అయ్యారు శశికళ. గవర్నర్‌తో భేటీ అనంతరం పన్నీర్‌ సెల్వం నవ్వుతూ బయటకొచ్చారు. మరి, చిన్నమ్మ కూడా నవ్వుతూనే బయటకొస్తారా.? ఏమోగానీ, సమాధి వద్ద అమ్మకు నివాళులర్పించిన శశికళ.. అమ్మ తనతో మాట్లాడిందంటూ పన్నీరు సెల్వంలా వ్యాఖ్యానించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

పన్నీర్‌ సెల్వం వెర్షన్‌ విన్న గవర్నర్‌, శశికళ వెర్షన్‌ని కూడా విన్నాక, రాత్రికి రాత్రి తన నిర్ణయం ప్రకటిస్తారో, నిర్ణయం కోసం మళ్ళీ సమయం తీసుకుని, 'ఛలో ముంబై..' అంటారో, ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడిందిప్పుడు.

Show comments