పాపం..బాహు ‘బలి’

ఇలా చేస్తే..? ఏం జరుగుతుంది? అన్న ఆలోచన? ఇలా చేస్తే..పర్యవసానం ఏమిటి?  అన్న భయం లేకపోవడం అన్నది ఈ కాలం జనాల తప్పిదంగా మారుతోంది. జీవితాలనో, కెరీర్ ను బలితీసుకుంటోంది. స్మార్ట్ యుగంలో ఏదీ రహస్యం కాదు. ఏం చేసినా తప్పించుకోలేము. కాస్త ప్రయత్నిస్తే చాలు, ఎక్కడ? ఏమిటి? ఎలా జరిగింది? అన్నది తెలుసుకోవడం కష్టం కాదు… మనం ఫోన్లు, కంప్యూటర్లల్లో చేసే ప్రతి పని రహస్యం కానే కాదు. కానీ ఈ సంగతి పూర్తిగా తెలిసి కూడా మొండి ధైర్యంతోనో, అత్యుత్సాహం తోనో,.తప్పులు చేస్తున్నారు. పోనీ దాని వల్ల ఏదైనా ప్రయోజనం వుంటుందా? ప్రయోజనానికి, ఫలితానికి బేరీజు వేసుకుని రిస్క్ చేస్తున్నారు అనుకోవడానికి? అదీ లేదు.

బాహుబలి 2 కి సంబంధించిన యుద్ధ దృశ్యాలు, అది కూడా ఇంకా ఏ మాత్రం మెరుగులు దిద్దని విడియో ఫుటేజ్, జస్ట్ 9 నిమషాలు తస్కరించారు. తను పనిచేసే సిస్టమ్ లో కళ్ల ముందు తను చూసినవి, తన ఫ్రెండ్స్ కు కూడా చూపించాలన్న అత్యుత్సాహమో, తన దగ్గర బాహుబలి 2 క్లిప్పింగ్స్ వున్నాయని చాటుకోవాలన్న అతి ఆడంబరమో, మొత్తానికి ఇలా చేసేలా చేసింది. కానీ ఈ రోజుల్లో ఒక్క వాట్సప్ షేరింగ్ చాలు, లక్షలకు చేరిపోవడానికి. మనకు వచ్చిన పోస్ట్ కరెక్ట్ నా? డూప్లికేట్ నా ? అసలు అది అర్థం వున్న పోస్టింగ్ నా? కాదా? అన్నది కూడా గమనించడం లేదు మన జనం. జస్ట్ ఫార్వార్డ్ అంటూ కొట్టేయడమే. పైగా ఒకరి కాదు. ప్రతి వాళ్లకు పది గ్రూపులు.  వాళ్ల ప్రొఫెషనల్, వాళ్లు ఊరి జనాలు, వాళ్లు చుట్టాలు, వాళ్ల ఫ్రెండ్స్, వాళ్లు చదువుకున్న స్కూలు జనాలు, వాళ్ల పిల్లల స్కూలు జనాలు, ఇలా గ్రూపులే గ్రూపులు.

పెదవి దాటిన మాట పృధివి దాటుతుందని, వాట్సప్ గుమ్మం దాటిన పోస్ట్ ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది. దాంతో ఇలాంటి తస్కర పోస్టింగ్ లకు శ్రీకారం చుట్టిన వారికి నానా బాధలు తప్పవు. చూసిన ఫ్రెండ్స్ బాగానే వుంటారు. చూపించిన వాడు బలైపోయాడు. తనను నమ్మి కీలకమైన విడియో ఫుటేజ్ తన సిస్టమ్ లో వుంచిన వాడిని మోసం చేస్తున్నానన్న ఆలోచన లేకుండా, జస్ట్ 9 నిమషాల రా ఫుటేజ్ తస్కరించి జీవితం బలి చేసుకున్నాడు  టాలీవుడ్ లోని విడియో టెక్నీషియన్.

రేపు ఏమవుతుందన్న భయం లేకపోవడం, సోషల్ నెట్ వర్కింగ్ అత్యుత్సాహం అంతకంతకూ పెరిగిపోతుండడం తప్ప ఇందుకు కారణం మరేమీ కాదు. 

Show comments