సమంత.. కొండంత రాగం తీసి.. ఇప్పుడేంటి?

దక్షిణాదిన తన నటనా పటిమకు తగిన సినిమాలు రావడం లేదని స్టేట్ మెంట్ ఇచ్చిన తార సమంత. కమర్షియల్ సినిమాల పాలిట రారాణిలాంటి హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత ఈ విషయంలో తన అసంతృప్తిని తెలియజేసింది. అలాగే.. మరో స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. “ఇచ్చిన ఎక్స్ ప్రెషనే పదే పదే ఇచ్చి.. కొన్ని వందల సార్లు అదే ఎక్స్ ప్రెషన్లతో బోర్ కొట్టేస్తోంది..’’ అని కూడా సమంత తనకు వస్తున్న పాత్రల పట్ల తన అసంతృప్తిని తెలియజేసింది. 

మరి దక్షిణాదిన హీరోలే సినిమాకు సోల్. హీరోయిన్లు ఉన్నది ఆటపాటలకు మాత్రమే. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేదు. హీరోయిన్లు కూడా పాత్ర లో డెప్త్ కన్నా.. దక్కే పారితోషకం మీదే దృష్టి పెట్టి పని చేసుకుపోతున్నారు. ఇన్నాళ్లూ ఇదే విధంగా వ్యవహరించిన సమంత మాత్రం ఇప్పుడు ధీర్ఘాలు తీస్తోంది!

మరి ఇలా మాట్లాడుతోంది కాబట్టి.. సమంత ఇక రొటీన్ సినిమాలేవీ ఒప్పుకోదేమో, హీరో ఓరియెంటెడ్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి.. డిఫరెంట్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల మీద దృష్టి సారిస్తుందేమో అనుకున్నారంతా! అయితే.. ఇన్ని మాటల తర్వాత సమంత తర్వాత చేయబోయే సినిమాలంటూ రెండు సినిమాలు వార్తల్లోకి వచ్చాయి. వాటిల్లో ఒకటి శివకార్తికేయన్ సినిమా, మరోటి విశాల్ సినిమా!

తమిళనాట ఇప్పుడిప్పుడు మాస్ హీరోగా ఎదురుగుతున్న హీరో శివకార్తికేయన్. వైవిధ్య భరితమైన సబ్జెక్టులనే ఎంచుకుంటున్న ఈ హీరో.. అంతిమంగా మాస్ ను ఆకట్టుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక విశాల్ సంగతి సరేసరి! ఈ హీరోల గత సినిమాలను చూస్తే.. హీరోయిన్ అనేది వీరి పాత్రలను ప్రేమించడానికి మాత్రమే ఉంటుంది. గ్యాప్ దొరికితే పాటలు వేసుకోవడానికి ఉంటుంది. వీరి రాబోయే సినిమాల్లో కూడా అంతకు మించి ప్రాధాన్యత ఉండదని నొక్కి వక్కాణించవచ్చు. ఎందుకంటే.. వీళ్లు చేసే సినిమాలు అలాంటివి. మరి మంచి పాత్రలు దక్కడం లేదు, ప్రాధాన్యత ఉన్న పాత్రలు లేకుండా పోయాయి.. అంటున్న సమంత ఈ హీరోల సినిమాలకు ఓకే చెప్పిందనే వార్తల నేపథ్యంలో.. కొండంత రాగం తీసి, ఇదేంటమ్మా సమంతా! అనుకోవాల్సి వస్తోంది.

Show comments