'గౌతమి పుత్ర శాతకర్ణి' ఓ చారిత్రక గాధ. ఇది కథ కాదు, చరిత్ర. చరిత్రకు సంబంధించి దొరికిన కొద్ది ఆధారాలతో ఓ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. ఈ క్రమంలో బాలకృష్ణ సహకారం చాలా గొప్పదన్నది నిర్వివాదాంశం. ఓ తెలుగు సినిమా, అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయానికి అత్యద్భుతమైన ఔట్‌పుట్‌తో రావడం అభినందనీయమే. అయితే, ఇక్కడ 'తెలుగు జాతి ఆత్మగౌరవం..' అన్న చర్చ జరుగుతుండడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీని ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా అదే బాటలో నడవడంతో, ఇప్పుడు 'శాతకర్ణి' తెలుగోడా.? కాదా.? అన్న చర్చకు కారణమయ్యింది. పన్ను రాయితీ అన్యాయం, అక్రమం అంటోన్నవాళ్ళంతా తెరపైకి తెస్తున్న అంశం, అసలు శాతకర్ణి తెలుగు చక్రవర్తి కానే కాడని. మహారాష్ట్రకు చెందిన శాతకర్ణి, తెలుగు నేలను రాజధానిగా చేసుకుని పరిపాలించాడంతే.. అన్నది వారి వాదన.
ఇప్పుడంటే తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇంకోటి.. ఇలా భిన్న వాదనలు విన్పిస్తున్నాయిగానీ, ఒకప్పుడు ఈ ఈక్వేషన్స్ లేవు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం. అది బ్రిటిష్ హయాంలో. కాకతీయుల పాలనలో పరిస్థితులు వేరు, నిజాం కాలంలో పరిస్థితులు ఇంకోలా వుండేవి. చరిత్రలోకి తొంగి చూస్తే చాలా నెత్తుటి మరకలు, అనేక వివాదాస్పద అంశాలూ కన్పిస్తాయి.
పన్ను రాయితీ అంశంపై వివాదం కోర్టుకి చేరితే, అక్కడ ఏం జరుగుతుందన్నది వేరే అంశం. అసలంటూ తెలుగోడి కాని శాతకర్ణి మీద సినిమా తీసి, తెలుగు జాతి ఆత్మగౌరవం.. ప్రతి తెలుగోడూ తొడకొట్టే చరిత్ర.. అని ప్రచారం చేసుకోవడమేంటన్న ప్రశ్నలకు ఇప్పుడు 'శాతకర్ణి' టీమ్ సమాధానం చెప్పాల్సి వుంటుంది. చాలా రీసెర్చ్ చేసి సినిమా తీశామని చెబుతోన్న దర్శకుడు క్రిష్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడో ఏమో.!