ప్రియాంకపై ‘సెక్సిస్టు వ్యాఖ్యల’ దుమారం!

ప్రియాంక గాంధీ అందంగా ఉండడం వల్ల మాత్రమే ఓట్లు రాబట్టగలరనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆమెను ఎన్నికల ప్రచారంలో మోహరిస్తున్నదా? ఇలాంటి అర్థం వచ్చేలా భాజపా రాజ్యసభ ఎంపీ, భజరంగదళ్ వ్యవస్థాపకుడు వినయ్ కతియార్ చేశారంటున్న వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో బుధవారం పెద్ద దుమారంగా మారుతున్నాయి. ప్రియాంక పెద్ద అందగత్తేమీ కాదని, ఓట్లు రాబట్టడానికి ప్రియాంకను మించిన అందగత్తెలు తమ పార్టీలో కూడా ఉన్నారని కతియార్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి అసలు కారణం. కతియార్ వ్యాఖ్యలకు ప్రియాంక కూడా స్పందిస్తూ.. ‘ఆయన మాటలు దేశంలో సగానికి పైగా ఉన్న మహిళల పట్ల భాజపా భావజాలానికి నిదర్శనం అని, వారి మాటలను చూస్తోంటే తనకు నవ్వు వస్తున్నదని’ వ్యాఖ్యానించారు.

ప్రియాంక అందం గురించి, అందం వలన ఆమె ఓట్లు రాబట్టడం గురించి వినయ్ కతియార్ విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో లింగవివక్షతో కూడిన సెక్సిస్టు వ్యాఖ్యలు చేశారనేది అసలు దుమారానికి మూల కారణం. ఈ ఆరోపణల గురించి కటియార్ ను ఓ టీవీ ఛానెల్ ప్రశ్నించినప్పుడు.. తాను నేరుగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ప్రియాంక గాంధీ అందంగా ఉంటుంది గనుక, ఓట్లు రాబట్టగలదని కాంగ్రెస్ ప్రచారానికి తెస్తున్నది కదా? అని మీడియా ప్రతినిధులు అడిగారని.. దానికి జవాబుగా మాత్రమే తాను, అందమే ఓట్లు రాబట్టేట్లయితే ఆమెకంటె అందం ఉన్నవారు తమ పార్టీలో ఉన్నారని చెప్పానని కటియార్ అంటున్నారు. అయితే ఆయన సమర్థించుకునే వాదనతో ప్రమేయం లేకుండానే.. ఈ వివాదం అప్పటికే బాగా ముదిరిపోయింది. భాజపా బుద్ధికి ఇది నిదర్శనంగా పేర్కొంటూ తీవ్రమైన వ్యాఖ్యలతో ప్రియాంక కూడా స్పందించడం విశేషం. 

లింగవివక్షతో కూడిన, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం మన నాయకులకు కొత్తేమీ కాదు. అమ్మాయిలపై అత్యాచారాలు పెరుగుతున్నాయనే అంశంపై.. కుర్రాళ్లు కదా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.. అంటూ ములాయంసింగ్ వ్యాఖ్యానించిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏపీలో సైతం మహిళా అధికారిపై ఎమ్మెల్యే చేయిచేసుకుంటే.. తప్పు ఆ అధికారిదే అని ముఖ్యమంత్రి స్వయంగా రాజీ కుదిర్చిన చౌకబారు ఘటన కూడా అందరికీ గుర్తుంటుంది. ఈ తరహాలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా తాజాగా కటియార్ ప్రియాంక అందంగురించి.. అందంగా ఉండడం వల్లనే ఓట్లు రాబడతారనే అంశం గురించి మాట్లాడడం రచ్చరచ్చగా మారుతోంది. 

Show comments