మన్మోహన్ హయాంలోనూ.. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయ్!

“సర్జికల్ స్ట్రైక్స్ చేయడం.. ఇది తొలి సారి కాదు..’’ డీజీఎంవో రన్ బీర్ సింగ్ మీడియా ముందుకు చెప్పిన మాటల్లో ఇది ఒకటి. బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకూ చేపట్టిన ఆపరేషన్ల గురించి వివరించినప్పుడు సింగ్ ఈ మాట చెప్పారు. మీడియా మొత్తం “సర్జికల్ స్ట్రైక్స్’’ అనే మాటకు తొలి సారి నిర్వచనం వినిపిస్తూ.. ఈ పదాన్ని భారతీయులకు ఇప్పుడే పరిచయం చేస్తున్నాం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండవచ్చు గాక. మోడీ వచ్చాకా నాగా సైనికుల మీద సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి, ఆ తర్వాత ఇప్పుడు పీవోకే జరుగుతున్నాయి.. అని మీడియా నొక్కి వక్కాణిస్తూ ఉండవచ్చు.

కానీ.. భారత మిలటరీ ఆపరేషన్ల చరిత్రను చూస్తే, గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఆ ‘గతం’ ఏది? అంటే… మన్మోహన్ హయాం! 2004 నుంచి 2014 సంవత్సర మధ్యం వరకూ సాగిన మన్మోహన్ హయాంలో కూడా భారత మిలటరీ ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించింది.

కానీ అప్పటికీ ఇప్పటికీ ప్రధానమైన తేడా ఏమిటంటే… ప్రచారం. అప్పుడు భారత ప్రభుత్వం కానీ, మిలటరీ కానీ అధికారికంగా ఈ విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడు చెప్పడం జరిగింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా, మీడియా ద్వారా ఈ అంశానికి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందంతే! అదీ తేడా.

2006 నవంబర్ లో ఈ తరహా ఆపరేషన్స్ జరిగాయని కొంతమంది మిలటరీ అధికారులు ధ్రువీకరిస్తున్నారు. భారత సైన్యం సరిహద్దులను దాటుకుని వెళ్లి పాకిస్తాన్ సైన్యానికి నష్టాన్ని చేసి వచ్చిందని తెలుస్తోంది. ఇక 2014 జనవరిలో ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్ ను స్వయంగా ధ్రువీకరించారు. యాన్యువల్ ఆర్మీ డే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయాన్ని వివరించారు.

మరి అప్పటికీ ఇప్పటికీ తేడా కేవలం ప్రచారం మాత్రమే. భారత ఆర్మీకి పరాక్రమం అనేది ప్రధానమంత్రుల మీద ఆధారపడి లేదు. అది మన్మోహన్ అయినా.. మోడీ ఉన్నా.. తెగువన చూపిన సందర్భాలెన్నో ఉన్నాయి.

Show comments