అక్కడెక్కడెక్కడి నుంచినో రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్య నాయుడుకు ఏపీలో ఆత్మీయ సత్కారం జరిగింది! మరి ఈ తెలుగు వాడు వేరే రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటి వచ్చాడని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారా? అంటే అదేం లేదు. వెంకయ్య సత్తా చాటింది నామినేటెడ్ పదవితోనే అయినా.. ఈయన ఆత్మీయులు ఈ సత్కారం చేశారు. అంతా కమ్మవాళ్ల మయం అన్నట్టుగా సాగిన ఈ కార్యక్రమంలో వెంకయ్య తన గొప్ప దనాన్ని చెప్పుకున్నాడు!
తను లాబీయింగ్ ద్వారా రాజ్యసభ సీటును సాధించానన్న విషయాన్ని మరిపించేలా.. కొన్ని దశాబ్దాల క్రితం తను ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలను గుర్తు చేసుకున్నాడాయన! ఇందిరాగాంధీ హవాలో 1978 లో గెలిచాను, ఎన్టీఆర్ ధాటికి తట్టుకుని 1983లో గెలిచాను అని వెంకయ్య చెప్పుకొచ్చాడు! బీజేపీకి జాతీయాధ్యక్షుడిగా కూడా వ్యవహరించానని వెంకయ్య నాయుడు చెప్పుకున్నాడు. బాగుంది.. 1978లో.. 83లో తను బీజేపీ వ్యతిరేకత ప్రభంజనాల్లో ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకోవడం బాగుంది.
అయితే ఆ తర్వాత ఎందుకు నామినేటెడ్ పదవులకు పరిమితం అయ్యారు? అనేదే ప్రశ్న! గమనించాల్సిన వాస్తవం ఏమిటంటే.. 1983 ముందుకు వరకూ బీజేపీ కి ఏదో రకమైన ఉనికి ఏపీలో ఉండింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఏపీలో ఉదయించిందో అప్పటి నుంచి బీజేపీ పయనం పడిపోవడమే తప్ప లేవడం లేదనట్టుగా సాగుతూ వస్తోంది. ఏపీ బీజేపీ నియంత్రిస్తున్న వెంకయ్య వంటి వాళ్లు .. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తారు తప్ప బీజేపీ బలోపేతాన్ని వీరు కోరుకోరని.. చాలా గట్టిగా వినిపించే అభిప్రాయం.
83 లో సత్తా చాటాను అని చెప్పుకున్న వెంకయ్య గారు.. ఆ తర్వాత ముప్పై మూడేళ్ల నుంచి ఎందుకు ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటలేకపోయారో కూడా చెప్పుకుని ఉండుంటే బావుండేది! మా తాతలు నేతలు తాగారు.. అని చెప్పుకున్న వాళ్లను చూశాం. కానీ వెంకయ్య ఏమో ఈ తరానికి ఏ మాత్రం పట్టని 33 ఏళ్ల కిందటి చరిత్ర చెబుతూ తన ఘనకీర్తిని చాటుకొంటున్నాడు! అప్పుడెప్పుడో తన సత్తా గురించి ఇప్పుడు చెబుతున్నాడీయన!
ఇప్పుడు వెంకయ్యను లోక్ సభకు పోటీ చేయవద్దదని ఎవరైనా అంటున్నారా? మూడు పర్యాయాలుగా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికై.. వారిని శతథా విసిగించి ఇప్పుడు మరో రాష్ట్రం కోటాలో నామినేట్ పదవిని సొంతం చేసుకున్న ఈయన ఈ ముప్పై ఏళ్ల గురించి మాట్లాడకుండా అంతకు ముందు గురించి మాట్లాడటాన్ని ఏమనాలి? అనేవి సామాన్యుల సందేహాలు!
ఎప్పుడో వ్యతిరేక గాలిలో గెలవడం కాదు.. అనుకూల పవనాల్లో కూడా ఇప్పుడు పోటీ చేయలేదేం! ఇలాంటి పోటీలు అన్నీ అమాయకులు, అర్భకులు పడేవి.. వెంకయ్య వంటి స్వయం ప్రకటిత తోపు మాత్రం రాజ్యసభకు వెళ్లడానికే ప్రాధాన్యతను ఇస్తారు కాబోలు! అంటున్నారు అమాయకులు.
అయినా.. రాజ్యసభకు ఎన్నికై పదవులు పొందడాన్ని తెగ కించపరిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంతకు ముందు ప్రధాని మన్మోహన్ విషయంలో బాబు ఇష్టానుసారం మాట్లాడేవాడు. మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికై ప్రధానమంత్రి పీఠాన్ని చేపట్టాడని.. దొడ్డిదారిన ప్రధానమంత్రి అయ్యాడని బాబు విమర్శించేవాడు. ఇప్పుడేమో అక్కడెక్కడో రాజ్యసభకు ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవిని చేపట్టిన వెంకయ్యను బాబు సత్కరించాడు! అంటే మన్మోహన్ ది అయితే దొడ్డిదారి.. మనోడిది అయితే రహదారా?