దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్న సంగతి జగమెరిగిన సత్యం. సక్రమ ఆస్తులతో పాటు అక్రమాస్తులూ ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అదో పెద్ద కథ. జయలలిత కన్నుమూయగానే ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయో? ఆమె వీలునామా రాశారా? రాయలేదా?...ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల, మీడియా ముందుకు వచ్చాయి. జయకు దక్షిణ భారతమంతటా ఆస్తులున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడివిట్ ప్రకారం ఆమె ఆస్తులు విలువ 117 కోట్లు. ఈ సంఖ్య ఒక్కో పత్రికలో ఒక్కో విధంగా ఉందనుకోండి.
మొత్తంమీద అత్యంత విలువైన ఈ సంపదంతా ఆమె ప్రాణ సఖి, క్లోజ్ ఫ్రెండ్ శశికళ నటరాజన్‌కు దక్కిందట...! స్థిర, చర ఆస్తులన్నీ శశికళ చేతుల్లోకి వెళ్లిపోయినట్లు ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక 'ది టెలిగ్రాఫ్' కథనం. జయలలితకు చెందిన 113 కోట్ల విలువైన ఆస్తులకు శశిశళ, ఆమె కుటుంబ సభ్యులు వారసులని టెలిగ్రాఫ్‌కు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం. జయలలిత తన ఆస్తుల గురించి రెండేళ్ల కిందటే వీలునామా రాశారట...! దాని ప్రకారం...పోయస్ గార్డెన్స్‌లోని జయ నివాసం 'వేద నిలయం' శశికళకు దక్కింది.
నీలగిరిలోని కోడనాడ్ ఎస్టేట్, జయ పబ్లికేషన్స్, శశి ఎంటర్‌ప్రైజెస్ ఇంకా మరికొన్ని ఆస్తులు కూడా ప్రాణ సఖికి దక్కాయి. ఇవి వీరిద్దరి ఉమ్మడి ఆస్తులు. తెలంగాణ రాజధాని హైదరాబాదులో జయకు కోట్ల విలువ చేసే వ్యవసాయ క్షేత్రం, ద్రాక్ష తోటలు వగైరా ఉన్న విషయం తెలిసిందే. ఈ నగరంలోని ఆస్తులన్నీ వివేక్ జయరామన్ చేతికి పోయాయి. ఇతను శశికళ సోదరుడు జయరామన్-ఇళవరసి దంపతుల కుమారుడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జయలలిత ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆస్తుల విలువ 113.73 కోట్లు. ఇందులో స్థిరాస్తుల విలువ 41.63 కోట్లు. చరాస్తుల విలువ 72.09 కోట్లు. అప్పులు 2.04 కోట్లు. 1967లో 1.32 లక్షల ఖర్చుతో నిర్మించిన పోయస్ గార్డెన్స్ ఇంటి విలువ 43 కోట్లు. హైదరాబాదులో జయకు దాదాపు 15 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆ తరువాత దాన్ని 18 ఎకరాలకు పెంచారట...!
కాంచీపురం దగ్గర 3.43 ఎకరాల భూమి ఉంది. ఆమెకు రెండు టయోటా ప్రాడో ఎస్‌యువిలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహీంద్రా జీపు, అంబాసిడర్ కారు ఉన్నాయి. ఇవి కాకుండా మహీంద్రా బొలెరో, స్వరాజ్ మజ్డా మాక్సీ, కాంటెస్సా వాహనాలున్నాయి. 1980లో జయలలితకు వీడియో కంపెనీ యజమానిగా పరిచయమైన శవికళ ఇప్పుడు ఈ అపారమైన సంపదకు వారసురాలైంది. క్రమంగా రాజ్యాంగేతర శక్తిగా ఎదిగింది. జయలలితకు-శశికళకు మధ్య రెండుసార్లు విభేదాలొచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలపై స్నేహితురాలిని దూరంగా ఉంచింది.
అంతేకాకుండా శశికళను, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి బహిష్కరించారు కూడా. పోయస్ గార్డెన్ ఇంట్లోనే ఉంటున్న శశికళను బయటకు పంపారు జయ. ఇంత జరిగినా మళ్లీ స్నేహితురాలిని చేరదీశారు. ఇదిలా ఉండగా, జయ ఇల్లు వేద నిలయంను ఆమె స్మారక నిలయంగా మార్చాలని శశికళ ఆలోచిస్తున్నట్లు ఓ పత్రిక రాసింది. ఈ ఇంటి గురించి జయ రక్త సంబంధీకులు (మేనకోడలు దీప వగైరా) గొడవ చేసే అవకాశముందని, అందుకే దీన్ని స్మారక మందిరంగా మార్చి ప్రజల సందర్శనార్థం వదిలేయాలని శశికళ అనుకుంటోందట...!
ఇక జయలలిత కన్నుమూసిన మరుక్షణమే శశికళ , ఆమె భర్త నటరాజన్ ఆమె ఇంటిని ఆక్రమించేశారు. పార్టీని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి తాను అధినేత కావాలని శశికళ ఆకాంక్ష. జయ అంత్యక్రియలు అయిపోగానే శశికళ, ఆమె భర్త పోయస్ గార్గెన్స్ ఇంట్లోనే మంత్రులు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. జయలలిత ప్రాణ సఖి కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించే అవకాశాలున్నాయా? చూడాలి.